అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అధ్యక్ష ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ వారాంతపు ర్యాలీ కోసం శనివారం వేలాది మంది వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. రోడ్లపైకి చేరుకుని అధ్యక్షుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు కత్తి గాట్లతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 23 మందిని అరెస్ట్ చేసినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ఎన్నుకునేందుకు సోమవారం ఎలక్టోరల్ కాలేజీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు ట్రంప్ మద్దతుదారులు. వేలాదిగా తరలివచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు ట్రంప్. 'మేక్ అమెరికా గ్రేట్ అగేయిన్' అనే హాష్‌ట్యాగ్‌ను జతచేశారు
" వావ్! దోపిడీని అడ్డుకునేందుకు వేలాది మంది ప్రజలు వాషింగ్టన్కు చేరుకున్నారు. దీని గురించి నాకు తెలియదు. కానీ నేను వారిని చూస్తాను. " అని పేర్కొన్నారు. అనంతరం మిలిటరీ అకాడమీలో జరుగుతోన్న ఆర్మీ-నేవీ ఫుట్‌బాల్ ఆట చూసేందుకు ర్యాలీలు జరుగుతోన్న ప్రాంతంపైగా హెలికాప్టర్లో వెళుతూ పరిశీలించారు.
శనివారం జరిగిన ర్యాలీల్లో సుమారు 15 వేల మందికిపైగా పాల్గొన్నారు. శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ప్లాజా వద్ద ఘర్షణలు తలెత్తిన తర్వాత సాయంత్రం నిరసనలు ముగించారు.
ఇదీ చూడండి:అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ