అన్ని దేశాలూ ప్రస్తుతం కొవిడ్-19పైనే ప్రధానంగా దృష్టి సారించాయి. వైద్యానికి సంబంధించిన వనరులన్నింటినీ దానిపైనే వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో క్షయ(టీబీ) కేసుల గుర్తింపు, చికిత్సలో జాప్యం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఫలితంగా టీబీతో మరణాలు పెరిగే అవకాశం ఉందని పరిశోధన పత్రంలో హెచ్చరించింది. ముఖ్యంగా లాక్‌డౌన్ అమలు, ఆరోగ్య నిపుణులకు ఇతర విధుల అప్పగింత తదితర కారణాలతో టీబీ నివారణ, చికిత్సలపై ప్రభావం పడుతోందని వెల్లడించింది.
‘‘కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా గత మూడు నెలల్లో టీబీ కేసుల గుర్తింపు 25% తగ్గింది. ఈ కారణంగా బాధితులకు చికిత్స అందక ఈ ఏడాది క్షయతో 13% అధికంగా అంటే.. 1,90,000 అధిక మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొత్తం టీబీ మరణాలు 16.6 లక్షలకు చేరుకోవచ్చు. ఇది 2015లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ మరణాలతో సమానం’’ అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. భారత్‌లో మహమ్మారికి ముందు ప్రతి వారం 45,875 టీబీ కేసులు నమోదవుతుండగా.. మార్చి 22 తర్వాత మూడు వారాల్లో కేసుల్లో 75% తగ్గుదల నమోదైంది. 11,367 కేసులు మాత్రమే నమోదయ్యాయి. టీబీ పరీక్షలు, గుర్తింపులో తగ్గుదలతో పాటు నమోదులో జాప్యం కూడా ఇందుకు కారణాలని చెబుతున్నారు.