కరోనా వైరస్‌తో చేసిన నష్టానికి.. చైనాపై అదనపు టారీఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. టారీఫ్‌లు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపిన ట్రంప్.. చైనా పట్ల తాము సంతోషంగా లేమని తెలిపారు.
అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో కూడా చైనాపై విమర్శలు చేశారు. కరోనా ఎక్కడ బయటపడిందో తెలియదని చైనా చెబుతూనే.. ఆ దేశంలో వైరస్ గురించి మాట్లాడే వారికి అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామంటూ పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు వైరస్ నమూనాలను చైనా అందించలేదని అన్నారు. వైరస్ వ్యాప్తిపై జవాబుదారీ తనం కావాలని మైక్ పాంపియో డిమాండ్ చేశారు.
చైనా నిర్లక్ష్యంతోనే...
కరోనా వ్యాప్తిపై చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని శ్వేతసౌధం వెల్లడించింది. అయితే చైనాపై ఏ తరహా చర్యలు తీసుకుంటారన్న అంశంపై కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. కానీ చైనాపై ట్రంప్ ఎంతో అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేసింది.
వైరస్ జన్యుక్రమంపై షాంఘైలోని ఓ ప్రొఫెసర్ చెప్పేంత వరకు.. చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పైగా ఆ ప్రొఫెసర్ ల్యాబ్‌ను మూసివేయించిందని శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి కైలీ మెక్‌నానీ తెలిపారు. వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని... నెమ్మదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి చెప్పిందని ఆరోపించారు.