మహమ్మారి కరోనా తీవ్ర హృద్రోగ సమస్యలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టి గుండెపోటుకు కారణమవుతోందని తెలిపారు. ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాలు.. గుండె సంబంధ రోగాలకు తెరతీస్తున్నాయని అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలను అమెరికా జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసన్లో ప్రచురితమయ్యాయి.
గుండెపైనా శ్రద్ధ అవసరం..
వైరస్ బాధితులను కాపాడటమే లక్ష్యంగా అత్యవసర వైద్యంలో పలు ఔషధాలు ఉపయోగిస్తున్నారు. అయితే రోగుల శ్వాస సమస్యపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని... కాగా గుండె సమస్యలపై శ్రద్ధ చూపకపోవడమే వైరస్ రోగుల మరణానికి దారితీస్తోందని పరిశోధకులు గుర్తించారు.
"మానవ శరీరంపై వైరస్ ఎంతమేరకు, ఎటువంటి ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవడానికి మేము ఎక్కువమంది రోగులను పరిశీలించాం. పరిశోధనల్లో ప్రత్యేకంగా గుండె వ్యవస్థపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం." -విలియం బ్రాడే, వర్జినీయా విశ్వవిద్యాలయం పరిశోధకులు
హృద్రోగాలతోనే ఇబ్బందులు..
కరోనా సోకిన నాలుగోవంతు బాధితుల్లో ఒక వంతు(24శాతం) కచ్చితంగా హృద్రోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఈ పరిశోధనలో గుర్తించారు. వైరస్ కారణంగానే గుండె విఫలమవుతుందా! అనేది అస్పష్టంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. మరణించిన రోగుల్లో మాత్రం గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపీడనం వంటి సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఫ్లూ లేదా ఇతర వైరస్లు శరీరంలోకి ప్రవేశించిన తొలివారంలోనే రక్త ఫలకాలను విడదీస్తాయని ఇదే మరణానికి దారి తీస్తుందన్నారు.
ప్రస్తుతం కొవిడ్-19కి సంజీవనిగా భావిస్తున్న మలేరియా ఔషధం హైడ్రోక్సీ క్లోరోక్విన్.. హృదయ స్పందను దెబ్బతీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు పరిశోధకులు. ఇది గుండె పని తీరుపైనా ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సైన్యాన్ని వీడాలనుకున్నా.. కరోనాతో యూ టర్న్