దక్షిణ చిలీ తీరప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత.. తీరంలోని అనేక నగరాలను తాకినట్లు సమాచారం. ఆదివారం రోజు చిలీ తీరంలో భూమి రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కోరల్ అనే నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే అది సునామీకి దారితీసే అవకాశాలు లేవని చిలీ నౌకాదళం తెలిపింది. లా అరౌకనియా, లాస్‌రియోస్, లాస్ లాగోస్, బియోబియో నగరాల్లో వేర్వేరు తీవ్రతలో భూమి కంపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. లా అరౌకనియాలో ఎలాంటి అత్యవసర ఫోన్ కాల్స్ కూడా రాలేదని అగ్నిమాపక దళాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ట్రక్‌ను ఢీకొన్న బస్సు- 60 మంది మృతి!