ఆటలకు వెళ్లి ఎర్రబడ్డ మొహంతో వచ్చిన కొడుకుని చూసి ఏమైందని అడిగింది తల్లి. 'పొరుగింటి అబ్బాయి 'నీతో ఎవరాడతార్రా నత్తోడా..' అన్నాడు' ఉక్రోషంగా చెప్పాడు ఆరేళ్ల కొడుకు. 'వాడి చెంప పగలగొట్టి రావాల్సింది..' చెప్పి తన పనిలో పడింది తల్లి. తల్లి మాటలు పిల్లాడిని ఆలోచనలో పడేశాయి. తనని వెక్కిరించిన వాళ్లందరినీ కొట్టి వస్తే తనతో ఆడుకోడానికి ఎవరుంటారూ అనిపించింది. మాట్లాడితే కదా వాళ్లు వెక్కిరిస్తున్నారు, అందుకని మాట్లాడకుండా ఆడుకోవాలనుకున్నాడు. ఆటల మీదే దృష్టి పెట్టాడు. బేస్‌బాల్, ఫుట్‌బాల్ ఎంత బాగా ఆడేవాడంటే- జో మా జట్టులో ఉండాలంటే కాదు, మా జట్టులో.. అని పిల్లలు పోటీపడేలా. కొడుక్కి ధైర్యం ఇవ్వడానికి అలా అన్నదే కానీ ఆ తల్లికీ తెలుసు తన బిడ్డది ఎదురుతిరిగి కొట్టే స్వభావం కాదనీ, పుట్టుకతో వచ్చిన లోపం వల్ల అతడు ఆత్మన్యూనతలో కూరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేననీ. అందుకే ఆమె తరచూ బిడ్డను దగ్గరికి తీసుకుని 'నా బంగారు తండ్రివి నువ్వు. చెల్లెలినీ తమ్ముళ్లనీ బాగా చూసుకుంటావు. నువ్వు తెలివైనవాడివని అసూయతో వాళ్లలా అంటారు, పట్టించుకోవద్దు' అంటూ సముదాయించేది. తల్లి ఇచ్చే ధైర్యానికి తన ఆటల మంత్రం జత చేసి స్నేహితులను గెలుచుకున్న ఆ పిల్లాడికి అది మొదటి పోరాటం మాత్రమేననీ తాను గెలవాల్సిన యుద్ధాలు జీవితంలో ఇంకా చాలా ఉన్నాయనీ అప్పుడు తెలియదు.
స్కూలు ఫీజు కోసం తోటపని
పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో కేథరిన్, జోసెఫ్ దంపతులకు తొలి సంతానంగా పుట్టాడు జోసెఫ్ రాబినెట్ బైడెన్. మొదట కాస్త డబ్బున్న కుటుంబమే అయినా బైడెన్ పుట్టేనాటికి తండ్రి కష్టాల్లో ఉన్నాడు. సరైన ఉద్యోగమేదీ దొరక్క కుటుంబాన్ని కొన్నాళ్లపాటు కేథరిన్ తల్లిదండ్రుల దగ్గరే వదిలేశాడు. చివరికి పాత కార్లు కొని అమ్మే వ్యాపారంలో స్థిరపడ్డాక జోసెఫ్ తన కుటుంబాన్ని డెలావెర్‌లోని క్లెమాంట్‌కి తరలించాడు. దాంతో బైడెన్ బాల్యం అంతా దిగువ మధ్య తరగతి కుటుంబాల మధ్య గడిచింది. స్కూలు ఫీజుకు డబ్బు సమకూర్చుకోవడం కోసం బైడెన్ కూడా తోటపని లాంటివి చేసేవాడు.
![special story on joe biden in eenadu sunday book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10270947_1.jpg)
హైస్కూల్లో చేరాక నత్తి సమస్యతో చాలా ఇబ్బందిపడ్డాడు బైడెన్. పిల్లలందరూ 'డాష్' అనీ 'నత్తి జో' అనీ వెక్కిరించేవారు. స్కూల్లో రోజుకొకరు చొప్పున ప్రార్థన సమయంలో ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి. అలా ఓరోజు బైడెన్ వంతు వచ్చింది. ‘ఒక్కో అక్షరాన్నీ పదిసార్లు పలుకుతావ్. నీవల్ల కాదులే పో. పెద్దయ్యాక ఏమవుతావో ఏమో' అంది టీచరు. 'అమెరికా అధ్యక్షుడినవుతా’ అంటూ కోపంగా వెళ్లిపోయాడు బైడెన్. ఆ మాట నోటినుంచి ఎందుకొచ్చిందో తెలియదు. బాధతో ఇంటికెళ్లి గదిలో దూరి తలుపేసుకున్నాడు. మాట్లాడడమే సరిగా రాని తను అధ్యక్షుడినవుతానని ఎందుకు చెప్పినట్లు.. తనకు నత్తి ఉంది కాబట్టి నవ్వుతారు. అందులో వాళ్ల తప్పేం ఉందీ.. సమస్య తనది కాబట్టి తానేపరిష్కరించుకోవాలి.. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న బైడెన్‌కి ఎదురుగా అద్దంకనపడింది. వెళ్లి దానిముందు నిలబడి మాట్లాడడం మొదలెట్టాడు. ముందు మాటలు, తర్వాత కవిత్వం చదవడం.. ఒక్కోసారి మామూలుగా, ఒక్కోసారి బుగ్గన ఒక గులకరాయి పెట్టుకుని. క్రమంగా అదో అలవాటుగా మారిపోయింది. రోజూ కనీసం ఓ గంట సాధన చేసేవాడు. కొన్నాళ్లకి నత్తి సమస్య తగ్గుతున్నట్లు గమనించాడు. చదువులో అంతంతమాత్రంగానే ఉన్నా క్లాస్ లీడరుగా ఎన్నికయ్యాడు. అతని సాధన ఫలించి ఇరవయ్యేళ్లు వచ్చేసరికల్లా నత్తి చాలావరకూ తగ్గిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ డెలావెర్ నుంచి చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేసి లా చదవడానికి సైరాక్యూజ్ యూనివర్సిటీలో చేరాడు.
తొలి వలపు
యూనివర్సిటీలో సహాధ్యాయిగా పరిచయమైన నీలియా తొలిచూపులోనే నచ్చేసిందని ఆత్మకథలో రాసుకున్నాడు బైడెన్. కూతురు రోమన్ కేథలిక్ అయిన బైడెన్‌ని పెళ్లి చేసుకోవడం నీలియా తల్లిదండ్రులకు ఇష్టంలేదు. వారి అభ్యంతరాన్ని కాదని ఇద్దరూ న్యూయార్క్ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరబ్బాయిలూ ఒక అమ్మాయీ పుట్టారు. డెలావెర్ బార్ అసోసియేషన్‌లో సభ్యుడై రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చే ఓ లాయరు దగ్గర ఉద్యోగంలో చేరాడు బైడెన్. జాత్యహంకార ధోరణితో వ్యవహరించే అప్పటి డెలావెర్ గవర్నర్ పట్ల కోపంతో మొదట తానూ రిపబ్లికన్లవైపు మొగ్గాడు. తర్వాత స్థానిక రిపబ్లికన్ పార్టీ నేతలు అతడికి పార్టీ సభ్యత్వం ఇవ్వజూపినా ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన రిచర్డ్ నిక్సన్ వ్యవహారశైలి నచ్చక స్వతంత్రుడిగా నమోదు చేసుకున్నాడు. తర్వాత ఏడాది ప్రజాన్యాయవాదిగా పనిచేస్తూ క్రమంగా డెమోక్రాట్‌గా మారాడు. సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు కానీ కార్పొరేట్ లా నచ్చేది కాదు, క్రిమినల్ లా వల్ల డబ్బు వచ్చేది కాదు. దాంతో అదనపు సంపాదన కోసం సంపన్నుల ఆస్తుల నిర్వహణ చూసిపెట్టేవాడు. ఆ పరిచయాలతో పలుకుబడి పెరగడమూ కౌన్సిల్‌కి ఎన్నికవడమూ వరసగా జరిగిపోయాయి. కోరుకున్న భార్య, ముద్దొచ్చే ముగ్గురు పిల్లలు, ఎక్కువ కాకపోయినా ఇల్లు గడపడానికి చాలినంత సంపాదన..సంతోషంగా జీవనం సాగిస్తున్న బైడెన్ దృష్టి సెనేట్ ఎన్నికలపై పడింది.
![special story on joe biden in eenadu sunday book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10270947_3.jpg)
పైసా లేకుండా..
ఎన్నికలంటేనే బోలెడంత ఖర్చు. అది పెట్టుకునే స్తోమత లేకపోయినా సెనేట్ ఎన్నికల బరిలో దిగాడు బైడెన్. భార్యతో పాటు తల్లిదండ్రులూ తోబుట్టువులూ తలా కాస్త డబ్బు వేసుకుని కరపత్రాలు ముద్రించి ఇస్తే వాటిని పట్టుకుని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి మాట్లాడేవాడు. చెల్లెలు వాలెరీ ఒవెన్స్ అతడికి పబ్లిసిటీ మేనేజరు. ఒక తమ్ముడు నిధులు సేకరిస్తే మరో తమ్ముడు కార్యకర్తలను సమీకరించేవాడు. తల్లి ఖర్చుల లెక్క రాసేది. వీళ్లందరినీ సమన్వయపరుస్తూ కార్యక్రమాలను ప్లాన్ చేసేది నీలియా. అప్పటికి వదినా మరదళ్లిద్దరూ చెరో స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వారాంతాల్లో ఆ పిల్లలు కూడా కరపత్రాలు పంచిపెట్టేవారు. పార్టీలో సీనియర్ సభ్యుడు టెడ్ కౌఫ్‌మన్‌ని ఆర్థికసాయం చేయమని అడిగాడు బైడెన్. 'చేస్తాను కానీ, నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోను' అని ముఖానే చెప్పాడాయన. మంచివాడన్న పేరుతోపాటు చాలాకాలంగా పదవిలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి బాగ్స్‌తో తలపడటం వ్యర్థమన్నాడు. రోజులు మారుతున్నాయనీ ప్రజలు మార్పు కోరుకోవచ్చనీ అతడికి నచ్చజెప్పాడు బైడెన్.
![special story on joe biden in eenadu sunday book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10270947_2.jpg)
'ఫలితాలు వెల్లడైన రోజు నాకిప్పటికీ గుర్తుంది. అసాధ్యం అన్నది ఏదీ ఉండదని నాకు మొదటిసారి అర్థమైన రోజు అది' అంటాడు కౌఫ్‌మన్- ఎన్నికల్లో బైడెన్ తొలి పోరాటాన్నీ, గెలుపునీ గుర్తుచేసుకుంటూ. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. ఫలితాలు వచ్చిన వెంటనే భార్యతో మాట్లాడుతూ 'ఏమిటోగా ఉంది నాకు, ఇంత పెద్ద విజయం.. నిజమేనా అనిపిస్తోంది. ఏదో బెంగగా, భయంగా ఉంది' అంటూ మనసు మూలల్లో కదలాడుతున్న ఆందోళనని పంచుకున్నాడు బైడెన్. అతని సిక్త్స్‌సెన్స్ నిజమే చెప్పింది. ముంచుకురాబోతున్న ఓ విపత్తుకి అది సూచనే అయింది.
ఒక్కసారిగా అగాధంలోకి..
అమెరికా రాజ్యాంగం ప్రకారం సెనేటర్‌కి ముప్ఫై ఏళ్లుండాలి. బైడెన్‌కి కొన్ని వారాలు తక్కువుంది. దాంతో అందరితోపాటు అతడు ప్రమాణస్వీకారం చేయలేకపోయాడు. అతడు అక్కడ రాజధాని నగరంలో కార్యాలయం ఏర్పాటుచేసుకుంటూ బిజీగా ఉండగా సొంతూళ్లో నీలియా క్రిస్మస్ పండుగకి సన్నాహాలు చేస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం పిల్లల్ని తీసుకుని కారులో షాపింగ్‌కి బయల్దేరింది. సందులో నుంచి రోడ్డెక్కుతున్న నీలియా కారుని హైవే మీద వేగంగా వస్తున్న ట్రక్కుఢీకొట్టింది. ఆ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న నీలియా, ఆమె పక్కనే ఉన్న ఏడాది చిన్నారి నవోమి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వెనకాల ఉన్న నాలుగేళ్ల బ్యూకి కాలు విరిగితే, మూడేళ్ల హంటర్‌కి పుర్రె ఎముకలు చిట్లాయి. ఆ వార్త విని బైడెన్ కుప్పకూలిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన భార్యనీ ముద్దులొలికే చిన్నారి పాపనీ రక్తపు ముద్దలుగా చూసి గుండెలు బాదుకుని ఏడ్చాడు. గాయాలతో విలవిల్లాడుతున్న కొడుకులని చూసి అతడి గుండె చెరువే అయింది.
కట్టుకున్న భార్యనీ కన్నబిడ్డనీకోల్పోయిన తనకి పదవెందుకంటూ రాజీనామాకి సిద్ధపడ్డాడు బైడెన్. సీనియర్ నాయకులు నచ్చజెప్పి ఆస్పత్రిలోనే అతడి చేత ప్రమాణస్వీకారం చేయించారు. పిల్లల కోసం బైడెన్ రోజూ రెండొందల కిలోమీటర్లు రైల్లో ప్రయాణంచేసి రాత్రికల్లా వాషింగ్టన్ నుంచి విల్మింగ్‌టన్‌లోని ఇంటికి చేరుకునేవాడు. 'వాళ్లమ్మ ఉంటే కథలు చెప్పి, వెచ్చగా దుప్పటి కప్పి పిల్లల్ని నిద్రపుచ్చేది. పొద్దున్నే ముద్దులతో నిద్రలేపేది. వాళ్లకి అమ్మని తేలేను. కనీసం నేనైనా దగ్గర ఉండాలి కదా' అనేవాడు. భార్యని తలచుకుని రాత్రంతా కుమిలిపోతూనే ఉండేవాడు. నీలియా తన ప్రాణమనీ, ఆమె లేకుండా తాను బతకలేననీ చెప్పేవాడు. సెనేట్‌కి వెళ్లాలనిపించకా వెళ్లినా పనిమీద దృష్టి పెట్టలేకా ఇబ్బందిపడేవాడు. అడుగడుగునా కనిపించే భార్య జ్ఞాపకాలు తట్టుకోలేక ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోవాలనిపించేదట. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. సెనేటర్ జాన్‌మెక్‌క్లెలాన్ బైడెన్ బాధను అర్థం చేసుకున్నాడు. జాన్ భార్యా కూతురూ అనారోగ్యంతో కన్నుమూయగా ఇద్దరుకొడుకులు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. 'ఉన్న నలుగురినీ పోగొట్టుకుని నేను బతకడం లేదూ. నీకింకా ఇద్దరు పిల్లలున్నారు. ప్రజలకు సేవచేసే అవకాశాన్నిస్తున్న పదవి ఉంది. కాబట్టి వారికోసం బతకాలి. నాలాగా పనిలోనే ఆనందాన్ని వెతుక్కో' అని ఊరడించేవాడు. జాన్ స్నేహంతో మెల్లగా తేరుకుని పార్టీలో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాడు బైడెన్.
వసంతం వచ్చినట్టే వచ్చి..
నీలియా మరణం తర్వాత ఐదేళ్లకి తమ్ముడి బలవంతంతో స్కూల్ టీచరుగా పనిచేస్తున్న జిల్‌ని కలిశాడు బైడెన్. ఆమె తన బిడ్డలకు మంచి తల్లి కాగలదనిపించింది. రెండేళ్ల స్నేహం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పాప పుట్టాక జిల్ డాక్టరేట్ చేసి ఇంగ్లిష్ ప్రొఫెసరుగా స్థిరపడింది. ముగ్గురు పిల్లలూ, అర్థంచేసుకునే భార్యా, సెనేటర్‌గా వరుస విజయాలూ... తన జీవితంలోకి మరోసారి వసంతం వచ్చిందనుకున్నాడు బైడెన్. కల నెరవేర్చుకునే సమయమైందని 1988లో అధ్యక్ష పదవికి పోటీలో దిగాడు. ప్రచార ప్రసంగంలో ఎవరి మాటల్నో కాపీ కొట్టాడన్న ఆరోపణలు రావడంతో పోటీనుంచి విరమించుకున్నాడు. అయినా సెనేట్‌లో సీనియారిటీ అతడికి బాధ్యతాయుతమైన పదవుల్ని తెచ్చిపెట్టింది. చారిత్రక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. తరచూ తలనొప్పితో విపరీతంగా బాధపడుతూ ఓసారి ఆఫీసులో హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన బైడెన్‌ని ఆస్పత్రిలో చేరిస్తే మెదడులో సమస్య ఉందన్నారు డాక్టర్లు. రెండుసార్లు మెదడుకి శస్త్రచికిత్సలు చేశారు. రెండుసార్లూ అతడు బతుకుతాడన్న గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్లు. బతికినా మాటపోతుందన్నారు. అలాంటిది డాక్టర్లనే ఆశ్చర్యపరుస్తూ బైడెన్ కోలుకున్నాడు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా ఎప్పటిలాగే సెనేట్‌కీ ఇంటికీ మధ్య రైలుప్రయాణం కొనసాగించాడు. ఒబామా తనను ఉపాధ్యక్షుడిగా ఎంచుకునేవరకూ- ఏకంగా 37 ఏళ్లపాటు బైడెన్ సాదాసీదాగా అందరితో కలిసి రోజూ రైలు ప్రయాణం చేసేవాడు.
అద్దంమీద ఆ మాట..
2008లో మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగినా నిధుల సేకరణలో, సభలకు ప్రజలను రప్పించుకోవడంలో విఫలమైన బైడెన్ ప్రచారం తొలిదశలోనే విరమించు కున్నాడు. అయితే ఆ ప్రయత్నం రాజకీయాల్లో అతడి హోదానీ, ఒబామాతో అనుబంధాన్నీ పెంచింది. బైడెన్ ప్రచారశైలీ, ప్రజలతో మమేకమయ్యే తీరూ నచ్చిన ఒబామా అతడిని తన ఉపాధ్యక్షుడిగా ఎంచుకున్నాడు. రెండోసారి కూడా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక 2016 అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవడం మొదలుపెట్టాడు బైడెన్. అదే సమయంలో పెద్ద కొడుకు బ్యూకి బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసింది. రెండేళ్లు వ్యాధితో పోరాడి ఓడిపోయాడు బ్యూ. తన చేతుల్లో పెరిగి చెట్టంత వాడై రాజకీయాల్లో తనకి వారసుడవుతాడనుకున్న కొడుకు మరణం ఏడు పదుల వయసులో బైడెన్‌కి శరాఘాతమే అయింది. ఎన్నికల మాట వదిలేసి నిరంతరం కొడుకుని తలచుకుని కుమిలిపోయేవాడు. అతడి దుఃఖాన్ని తగ్గించి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి జిల్ చాలా కష్టపడాల్సి వచ్చేది. 'చీకట్లోనూ చూడగలిగేలా చేసేది నమ్మకం ఒక్కటే' అన్న డానిష్ తత్వవేత్త మాటల్ని కాగితం మీద రాసి గదిలో అద్దంమీద అతికించింది. దానిద్వారా భార్య తనకి ఏం చెప్పాలను కుంటోందో అర్థంచేసుకున్నాడు బైడెన్. మెల్లగా తన బాధలోంచి బయటికి వచ్చాడు. పొగ తాగని, మద్యం ముట్టుకోని బైడెన్‌కి పిల్లలతో ఆడుకోవడమన్నా, చాకొలెట్ చిప్ ఐస్‌క్రీమ్ తినడమన్నా చాలా ఇష్టం. మనవలతో ఆడుకుంటూ యూనివర్సిటీల్లో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలిస్తూ మొత్తానికి గుండెనిబ్బరం చేసుకుని 2020 ఎన్నికలకు సిద్ధమయ్యాడు.
![special story on joe biden in eenadu sunday book](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10270947_4.jpg)
బైడెన్ పోటీ చేస్తే గెలుస్తాడని పార్టీ మొదటినుంచీ నమ్మకంగానే ఉన్నా- ఆయన వయసూ గతంలోని వైఫల్యాలూ ప్రత్యర్థులకు ప్రచారాస్త్రాలయ్యాయి. అయినా అవేవీ బైడెన్ గెలుపుని అడ్డుకోలేకపోయాయి.
'చిన్నప్పుడు పరుగులు తీస్తూ పడిపోతే- ఎన్నిసార్లు పడ్డావని కాదు, ఎంత త్వరగా లేచావన్నది ముఖ్యం. గెటప్ మ్యాన్... అనేవారు నాన్న. ఆ మాటే ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. ఆత్మీయులను పోగొట్టుకున్న బాధ జీవితకాలం పోదు. మరింత ఎక్కువగా ప్రేమించడమే దానికి మందని అనుభవంతో తెలుసుకున్నాను. అధ్యక్షుడిని కావాలన్నది నా కోరికైతే, సామాన్య ప్రజలకు సేవ చేయాలన్నది నా ఆశయం' అనే బైడెన్- పెద్ద విద్యావేత్త కాదు, గొప్ప సిద్ధాంతకర్తా కాదు, పక్కా వీధి నాయకుడు. శ్రామికుల పక్షపాతి.
* * *
పుట్టుకతో వచ్చిన సమస్య పట్టుదలను పెంచింది. ఆటల మీద మక్కువ అందరినీ కలుపుకుని వెళ్లడమెలాగో నేర్పింది.
ఆత్మీయులను కోల్పోయిన అనుభవం సహానుభూతిని పెంచింది.
సుదీర్ఘ రాజకీయ జీవితం వ్యవస్థలో తేవాల్సిన మార్పులేవో చెప్పింది.
అతడిప్పుడు అనుభవాలు తీర్చిదిద్దిన మనిషి.. అన్ని యుద్ధాల్లో రాటుదేలిన మనీషి. అందుకే ప్రజాతీర్పు అతడిని గెలిపించింది! దేశాధ్యక్షుడిని చేసింది!
మాటే..సాంత్వన!
ఓ దుండగుడి తుపాకీ తూటాలకు బడికెళ్లిన తన బిడ్డ బలైపోయాడని తెలిసి మార్క్ బార్డెన్ చేష్టలుడిగిపోయాడు. ఏకంగా ఇరవై మంది పసివాళ్లు, ఆరుగురు టీచర్లు ప్రాణం కోల్పోయిన ఆ దుర్ఘటన జరిగిన మర్నాడే మార్క్‌కి దేశ ఉపాధ్యక్షుడి నుంచి ఫోను వచ్చింది. ఒక తండ్రిగా తన దుఃఖాన్ని అర్థం చేసుకుని ఓదార్చడమే కాక బాధనుంచి బయటపడటమెలాగో చెబుతున్న ఆయన మాటలు మార్క్ ఆలోచనాధోరణిని మార్చేశాయి.
భర్త ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ సభ్యురాలు మేరీ హతాశురాలైంది. బాధతో కుంగిపోతున్న ఆమెను 'దూరమైన ఆత్మీయులను తలచుకున్నప్పుడు మన పెదవుల మీద చిరునవ్వు రావాలి, కన్నీరు కాదమ్మా' అంటూ సముదాయించింది అప్పటి దేశ ఉపాధ్యక్షుడే. టీవీ వ్యాఖ్యాత ఇంటర్వ్యూ చేస్తుంటే వైస్ ప్రెసిడెంట్ తల వంచుకుని కొడుకు క్యాన్సర్ పోరాటం గురించి చెప్పుకుంటూ పోతున్నాడు, వ్యాఖ్యాత కన్నీళ్లను ఆపుకోలేకపోతోంది. ఆమె తండ్రి కూడా అదే క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయమది. ఒక్కసారి తలెత్తి ఆమె ముఖంలోకి చూసిన ఆయన మరుక్షణం తనను తాను సంబాళించుకున్నాడు. తండ్రి కోలుకుంటాడనీ బాధపడవద్దనీ ఆమె చేతులు పట్టుకుని ధైర్యం చెప్పాడు. ఆ దృశ్యం ప్రేక్షకుల కళ్లూ చెమర్చేలా చేసింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు జో బైడెన్ గురించి అక్కడి వారు గుర్తుచేసుకుంటారు. ఆయన సహానుభూతి తమ కష్టాన్ని ఎలా మరిపించిందో చెబుతారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానన్న ధైర్యం ఇవ్వడమే కాదు, తుపాకీ సంస్కృతీ, హింసాత్మక నేరాలకు వ్యతిరేకంగా బైడెన్ ఎంతోకాలంగా పోరాడుతున్నాడు. గృహహింస చట్టం రూపకల్పనలోనూ కీలకపాత్ర పోషించాడు.
రచయితగా..
ఇరవై తొమ్మిదేళ్లకే సెనేటర్‌గా ఎన్నికైన బైడెన్ పిన్న వయసులో ఆ పదవికి ఎన్నికైన రెండో వ్యక్తి. అప్పటి నుంచీ ఉపాధ్యక్ష పదవి చేపట్టేవరకూ తన సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి 'ప్రామిసెస్ టు కీప్' పేరుతో పుస్తకం రాశాడు బైడెన్. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అయింది. కొడుకు బ్యూ క్యాన్సర్ పోరాటాన్నీ కుటుంబసభ్యుల ఆవేదననీ కళ్లకు కట్టాడు 'ప్రామిస్ మి, డాడ్' అనే పుస్తకంలో. భార్య జిల్ కూడా చిన్నపిల్లలకు స్ఫూర్తినిచ్చేలా జో చిన్నప్పటి ఫొటోలూ విశేషాలతో 'జోయి: ద స్టోరీ ఆఫ్ జో బైడెన్' అనే పుస్తకం రాసింది.
ఇదీ చదవండి : కమలా హారిస్‌కు మైక్ పెన్స్ అభినందనలు