భవిష్యత్తు అంతరిక్షపరిశోధనలకు అనుగుణంగా వ్యోమగాముల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాసా ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ప్రస్తుతం 48 మంది ఉండగా.. ఆ సంఖ్యను మరింత పెంచుకోనున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ పేర్కొంది.
20వ వార్షికోత్సవం..
ఈ ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష కార్యకలాపాలను మరింత విస్తృత పర్చాలని నిర్ణయించిన నాసా దరఖాస్తులను ఆహ్వానించింది. 2024 నాటికి రెండు విడతల్లో ఓ మహిళ, ఓ పురుషుడిని చంద్రుడిపైకి పంపనున్నట్లు నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్‌స్టెయిన్ ప్రకటించారు.
"అత్యంత ప్రతిభావంతులైన మహిళలు, పురుషులను వ్యోమగామి దళంలో చేరడానికి ఆహ్వానిస్తున్నాం. అర్హత గల అమెరికన్ల నుంచి దరఖాస్తులను కోరుతున్నాం. మార్చి 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు అవసమైన శిక్షణ ఉంటుంది."-నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టెయిన్
2030లో చంద్రుడు, అంగారకుడిపై విస్తృతమైన పరిశోధనలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను తమ సొంత రాకెట్లు ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది నాసా. అప్పుడు పంపే వ్యోమగాముల బృందంలో నూతనంగా ఎంపికయ్యే వారిని చేర్చనున్నారు.