ఈ విశ్వంలో మనకు అతి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు...ఎన్నో ఏళ్ల నుంచి భానుడి గురించి రహస్యాలు తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. తాజాగా సూర్యుడిపై మరిన్ని ఆసక్తికర విషయాలను వెలికి తీసేందుకు ఓ అంతరిక్ష నౌకను పంపించనుంది నాసా. ప్రస్తుతం ఈస్పేస్క్రాఫ్ట్కు సంబంధించిన తుది పరీక్షలు ఇటలీలో నిర్వహిస్తోంది. యూరోపియన్ స్పేస్ ఏజేన్సీ(ఈఎస్ఏ)తో కలిసి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది నాసా. 2020 ప్రారంభంలో ఈ సోలార్ ఆర్బిటర్‌ను ప్రయోగించనున్నారు.
సూర్యుడికి 4.5 కోట్ల కి.మీ దూరంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ సంచరించనుంది. బుధ గ్రహానికంటే దగ్గరగా ఈ అంతరిక్ష నౌక వెళ్లనుంది.
ఎలా పనిచేస్తుంది..?
ఈ స్పేస్‌క్రాఫ్ట్ యాంటెనాలా పనిచేస్తుంది. సూర్యుడి వద్ద నుంచి వచ్చే వేడి పవనాలను గ్రహించి ఆ సంకేతాలను అంతరిక్ష కేంద్రానికి చేరవేస్తుంది. 500 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతను తట్టుకుని అందులో నుంచి వచ్చే సహజ పౌనఃపున్యాలను గ్రహిస్తుంది. ఇంత వేడిని తట్టుకునేందుకు అంతరిక్ష నౌకకు ప్రత్యేకంగా ఓ కవచాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు.
సూర్యుడి ధ్రువ మండలం దృశ్యాలను ఇది రికార్డు చేస్తుంది. భానుడి ఆకర్షణ శక్తిని అంచనా వేస్తుంది. కక్ష్యలో 160 రోజులపాటు తిరుగుతుంది.
"సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లబోతున్నాం. 45 మిలియన్ కిలోమీటర్లంటే కొంచెం దూరమే అయినా... భూమి నుంచి సూర్యుడి దూరంతో పోల్చుకుంటే తక్కువే. భూ ఉష్ణోగ్రత కంటే 13 రెట్లు ఎక్కువగా ఉండే భానుడి వేడిని గమనించబోతున్నాం. అక్కడ దాదాపు 500 సెంటిగ్రేడు ఉష్ణోగ్రత నమోదవుతుంది" -- ఇయాన్ వాల్టర్స్, సోలార్ ఆర్బిటర్ ప్రాజెక్టు మేనేజర్
సూర్యుడికి 45 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యకు 2022 ఏప్రిల్‌నాటికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇది చదవండి: కృత్రిమ మేధతో 'రోబో సైనికులు' వస్తున్నారు!