అమెరికాలో ఓ సిక్కుపై ఓ నల్ల జాతీయుడు సుత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈమేరకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఓ హోటల్ వద్ద.. అక్కడే పనిచేస్తున్న సుమిత్ అహ్లూవాలియా(32)పై ఆగంతకుడు దాడి చేసినట్లు ఓ స్థానిక న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. "నిన్ను నేను ఇష్టపడటం లేదు.." అంటూ ఆ వ్యక్తి పెద్దగా కేకలు పెడుతూ దాడికి పాల్పడ్డాడు.
దీనిపై జాతి విద్వేషపూరిత ఘటనగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణ జరపాలని న్యూయార్క్‌కు చెందిన ఓ సిక్కు స్వచ్ఛంద సంస్థ పోలీసులను కోరింది. ఏప్రిల్ 26న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అహ్లూవాలియా తెలిపారు. "ఆ రోజు ఆగంతకుడు హోటల్ లాబీలోకి వచ్చి పెద్దగా కేకలు పెడుతున్నాడు. అంతలోనే అతను జేబులో చెయ్యి పెట్టుకుని నావైపు పరిగెత్తాడు.
అతను తుపాకీ తీస్తాడేమోనని అనుకున్నా. నేను అతన్ని వారిస్తూ 'ఏమైంది? నువ్వు నాకు సోదరుడివి' అని అన్నాను. దానికి అతను 'నీదీ నాదీ ఒకటే చర్మం కాదు' అంటూ నా తలపై సుత్తితో కొట్టి పారిపోయాడు" అని సుమిత్ నాటి ఘటనను వివరించినట్లు ఆ వెబ్‌సైట్ పేర్కొంది. వెంటనే అతన్ని అత్యవసర గదికి తరలించి.. అనంతరం వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ఐదు రోజులు గడిచిన తర్వాత కూడా సుమిత్ భయాందోళనల్లోనే ఉన్నట్లు పేర్కొంది. కాగా పోలీసులు అనుమానితుడి ఫొటోలను విడుదల చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: ఆసియాకు చెందిన యజమాని షాపుపై దాడి