నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలపై అగ్రరాజ్యం స్పందించాలని భారతీయ అమెరికన్ చట్టసభ్యుల బృందం మైక్ పాంపియోకి లేఖ రాసింది. ఈ బృందంలో అమెరికన్ కాంగ్రెస్ మహిళ పరిమళ జైపాల్‌తో పాటు ఏడుగురు చట్టసభ్యులు ఉన్నారు.
నూతన సాగు చట్టాలు భారతీయ రైతులకు ముఖ్యంగా పంజాబ్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తాయని సిక్కు-అమెరికన్ చట్టసభ్యులు డిసెంబర్ 23న పాంపియోకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అనేక మంది భారత-అమెరికన్ కుటుంబాలు ఈ చట్టాలతో ప్రభావితం అవుతాయని.. అందువల్ల భారత విదేశాంగ మంత్రితో సత్వరమే చర్చలు జరపాలని ఆ లేఖలో కోరారు. అమెరికా సమాజం ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తుందని ఈ సమయంలో భారత్‌కు తగిన సలహాలివ్వాలని పాంపియోను కోరారు. ఇక ప్రస్తుత చట్టాలపై భారత ప్రభుత్వ విధానాలను గౌరవిస్తామని.. తెలిపిన చట్టసభ్యులు శాంతియుతంగా నిరసనలు చేస్తోన్న రైతుల ఆర్థిక భద్రతకు భరోసానివ్వాలని కోరారు.
మరోవైపు రైతు ఆందోళనలను భారత ప్రభుత్వం అణచివేస్తోందంటూ వివిధ దేశాధ్యక్షులు చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘూటుగా స్పందించింది. ఇది భారత అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పింది. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తోందన్న వాదనలను విదేశాంగ కార్యదర్శి కొట్టిపారేశారు. భారత అంతర్గత వ్యవహారాలపై విదేశీ శక్తులు మాట్లడటాన్ని తప్పుబట్టారు.
ఇదీ చదవండి: రక్షణ బిల్లుపై ట్రంప్ వీటో అస్త్రం