ఈ నెలలో కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో చర్చించేది లేదని స్పష్టం చేశారు ఐరాసలో బ్రిటన్ శాశ్వత ప్రతినిధి కరెన్ పియర్స్. ఈ నవంబర్‌లో జరిగే మండలి సమావేశాలకు ఆయనే అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం చర్చించటానికి ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయని ఆయన పేర్కొన్నారు. మండలిలో చర్చించే అంశాల జాబితాలో ప్రస్తుతం 'కశ్మీర్ సమస్య' లేదన్నారు.
ప్రతి నెలా భద్రతా మండలిలో చర్చించటానికి షెడ్యూల్లో లేని కొత్త విషయాలను సభ్యులు ఎంచుకుంటారు. కానీ ఈసారి మండలి సభ్యులు కశ్మీర్ అంశాన్ని ఎంచుకోలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పియర్స్.
చైనా, పాకిస్థాన్ దేశాలు కశ్మీర్ అంశాన్ని చర్చించాలని భద్రతా మండలిని కోరిన తర్వాత ఆగస్టు నెలలో కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అంశాన్ని చర్చించినట్లు స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో అధికరణ 370 రద్దు అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశం.. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నించింది. అయితే.. ఇది ముమ్మాటికీ తమ అంతర్గత విషయమేనని భారత్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:దిల్లీలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం.. కానీ..!