కొవిడ్-19 సోకిన బాధితుల్లో తీవ్రస్థాయి రుగ్మతలు లేదా మరణం ముప్పు పొంచి ఉన్నవారిని ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఆసుపత్రిలో చేరిన ఒక్కరోజు లోపే వారిని గుర్తించే వీలుండటం విశేషం. అలాంటివారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక పరిశోధనాత్మక ఔషధాలతో చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు.
కరోనా బాధితుల స్థితిని సాధ్యమైనంత త్వరగా విశ్లేషించడానికి వైద్యులకు మెరుగైన సాధనాలు అవసరం. ప్రపంచవ్యాప్తంగా అనేక చికిత్స విధానాలకు తీవ్ర కొరత ఉండటమే ఇందుకు కారణమని పరిశోధనలో పాలు పంచుకున్న ఆండ్రూ గెల్మన్ పేర్కొన్నారు. "వయసు ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా కొందరు రోగుల్లో హైపర్ ఇన్ఫ్లమేటిరీ పరిస్థితి ఎందుకు ఎదురవుతోందన్నది ఆసక్తికరంగా మారింది. కణజాలం దెబ్బతినడం కూడా ఇందుకు కారణం కావొచ్చని పరిశోధన సూచిస్తోంది." అని ఆయన తెలిపారు.
వైరస్ల వల్ల జరిగే కణజాల నష్టాన్ని నెక్రోసిస్ అంటారు. అది ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందన. దీనివల్ల కణాలు తెరుచుకొని.. మైటోకాండ్రియల్ డీఎన్ఏ సహా తమలోని అన్ని భాగాలను రక్తంలోకి కలిపేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మైటోకాండ్రియా అనేది కణంలోని శక్తి ఉత్పత్తి కేంద్రం. అందులో ఒక అరుదైన జన్యుపదార్థం ఉంటుంది. ఇది కూడా ఇన్ఫ్లమేటరీ పదార్థమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్ బాధితుల్లోనూ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఇలాంటి ప్రక్రియ జరుగుతోందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. అందువల్ల రక్తంలో మైటోకాండ్రియల్ డీఎన్ఏ ఉండటం.. కీలక అవయవాల్లో కణాల మృతికి సంబంధించిన ప్రారంభ చిహ్నం కావొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో మైటోకాండ్రియల్ డీఎన్ఏ స్థాయిని కొలవడం ద్వారా భవిష్యత్లో కొవిడ్ తీవ్ర రూపం దాలుస్తుందా అన్నది తేల్చే పరీక్షను తాము అభివృద్ధి చేశామన్నారు.