'సద్గురు'గా సుప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్.. అమెరికాలో యాత్ర చేపట్టారు. 'ఆఫ్ మోటార్ సైకిల్స్ అండ్ మిస్టిక్'గా పిలిచే ఈ పురాణ సంబంధిత రైడ్లో.. 15 శతాబ్దానికి పూర్వం యూరోపియన్లు రాక ముందు అమెరికా చరిత్ర గురించి అన్వేషించనున్నారు. ఈ వలసలు ప్రారంభం అయినప్పటినుంచీ, ఆవిష్కరణలకు, వ్యాపారానికి, సాహసాలకు, సృజనాత్మకతకు గత 200 ఏళ్లుగా, అమెరికా తన తీరాలకు ప్రపంచాన్ని ఆహ్వానించింది. బలమైన దేశ నిర్మాణానికి తెరతీసింది.
అమెరికాను అంతర్గతంగానూ, బాహ్యంగానూ అన్వేషిస్తూ 6000 మైళ్ళు సాగే ఈ యాత్రను సద్గురు టెన్నెసీ నుంచి ఆరంభించి, అమెరికా ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, జీవితాలను శోధిస్తూ అమెరికాలో 15 రాష్టాల్లో ప్రయాణిస్తారు.
"ఇక్కడ నేను ఈ ప్రదేశపు అందానికి కాకుండా, దాని బాధ వల్ల ఆకర్షితుడినయ్యా. 1999 లో నేను సెంటర్ హిల్ లేక్ దగ్గర ఉన్నప్పుడు, నేనొక ఘనీభవించిన ప్రేతానికి ఎదురయ్యాను. అది ఎంతో బాధతో ఉంది. అప్పటి నుంచి ఆ ప్రాంతాలలోని లోతైన బాధను గమనిస్తూ ఉన్నాను. మన అవగాహనలో ఉన్నా, లేకున్నా అది మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఏ కారణం లేకుండా చెప్పనలవి కాని బాధ కలుగుతుంది. ఈ ప్రాంతాన్ని చారిత్రకంగా ‘ట్రెయిల్ ఆఫ్ టియర్స్’ అని పిలిచే వారని నాకు ఆ తరువాత తెలిసింది. అనేక ప్రాంతాల్లో మేము చూసినట్లుగానే, తమ చుట్టూ ఉండే వాటితో మమేకమై బతికేవారి స్వభావం, అది బాధ అయినా, ఆనందమైనా, వాళ్ళు కూర్చున్నా, నిల్చున్నా అలా అక్కడే ఉండి పోతుంది" అని ఆ ప్రాంతం గురించి మాట్లాడారు సద్గురు.
శతాబ్దాలుగా అమెరికన్ల దృష్టినే కాక, ప్రపంచ దృష్టినీ ఆకర్షించిన ఆ ప్రాంత అనాది సంస్కృతిలోకి లోతుగా చూడటం కోసం సద్గురు యాత్ర నెలరోజుల పాటు సాగుతుంది.
ఇదీ చదవండి: యక్షగానంలో ముస్లిం మహిళ అసమాన ప్రతిభ