Russia America Sanctions: రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై కఠినమైన అర్థిక ఆంక్షలు విధించింది అమెరికా. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. శ్వేతసౌథంలో జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్.. రష్యాను కబ్జాదారుగా పేర్కొన్నారు.
" బలగాల ద్వారా ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని పుతిన్ చూస్తున్నట్లు నా అభిప్రాయం. గతరాత్రి ఆయన ప్రసంగం వింటే ఇదే అనుమానం కలుగుతుంది. ఇది ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఆరంభం. వెస్ట్ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపివేశాం. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తాం. నార్డ్ స్ట్రీమ్ 2 పైపులైన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేసేందుకు జర్మనీకు సహకరిస్తాం. ఇప్పటినుంచి రష్యా చర్యకు ప్రతి చర్య ఉంటుంది."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఉక్రెయిన్‌లోని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ యత్నిస్తున్నాడని బైడెన్ మండిపడ్డారు. ఆక్రమణ ఆగకపోతే.. మరింత కఠినంగా ఆంక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రత కల్పించి రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని అన్నారు బైడెన్.
జెనీవా సమావేశం రద్దు..
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల దృష్ట్యా జెనీవా వేదికగా రష్యా విదేశాంగ మంత్రితో జరగనున్న సమావేశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ రద్దు చేశారు. దౌత్యపరమైన అంశాలపై రష్యా సీరియస్‌గా లేదని అర్థమవుతోంది. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలను రద్దు చేస్తున్నట్లు బ్లింకెన్ తెలిపారు.
కెనడా ఆంక్షలు..
కెనడా కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలమంది కెనడా సైనికులను తూర్పు యూరోప్‌నకు పంపిస్తోంది కెనడా ప్రభుత్వం.
ఇదీ చూడండి: రష్యా చర్యపై ఆ దేశాల ఆగ్రహం.. అమెరికా ఆంక్షలు