అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషాలో రెండోరోజైన సోమవారమూ (అమెరికా కాలమానం ప్రకారం) తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఆఫ్రో-అమెరికన్ జాకబ్ బ్లేక్ (29)పై పోలీసుల కాల్పుల ఘటనను నిరసిస్తూ వందలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు. వాహనాలకు నిప్పుబెట్టారు. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొందరు న్యాయస్థానం భవనంపైకి సీసాలు, బాణసంచా బాంబులు విసిరారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాకబ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆందోళనలు చల్లారకపోవడంతో నేషనల్ గార్డ్ సభ్యులు 125 మందిని గవర్నర్ పిలిపించారు. ఈ ఘటనతో సంబంధమున్న అధికారులను బాధ్యులను చేయాలని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రహదారి పక్కన నిలిపి ఉంచిన కారులోకి వెళుతున్న బ్లేక్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన ముగ్గురు పిల్లలు వాహనంలోనే ఉన్నారు.
'ఎడమవైపు చచ్చుబడిపోయింది'
తన కుమారుడి నడుము నుంచి కిందకు ఎడమవైపున్న భాగమంతా చచ్చుబడి పోయిందని జాకబ్ బ్లేక్ తండ్రి చెప్పారు. ఆయన పేరు కూడా జాకబ్ బ్లేకే. ఉత్తర కరోలినాలో ఉండే ఆయన కుమారుడికి అండగా ఉండేందుకు కెనోషా వచ్చారు. ఈ సందర్భంగా షికాగో సన్-టైమ్స్‌తో మాట్లాడుతూ.. తన కుమారుడి శరీరంపై ఎనిమిది తూటా గాయాలు ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:- రానున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఎవరి పక్షమో?