మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఆయన భార్య మిలిందా గేట్స్ 2019లోనే తీసుకున్నారా? అప్పటి నుంచే ఆమె విడాకుల న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. 2019లోనే మిలిందా గేట్స్ విడాకులకు సంబంధించి న్యాయవాదులతో చర్చలు జరిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. లైంగిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలే వివాహబంధం బీటలువారడానికి కారణమని తెలుస్తోంది.
బాలికలపై లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణా లాంటి కేసుల్లో ఎప్‌స్టీన్ నిందితుడు. శిక్ష కూడా పడింది. 2019లో జైల్లోనే మరణించాడు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో శిక్ష పడిన వ్యక్తితో బిల్‌గేట్స్ సన్నిహితంగా మెలగడంపై మిలిందా గేట్స్ అభ్యంతరం చెప్పారు. అయితే ఎప్‌స్టీన్‌తో తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నానని బిల్‌గేట్స్ గతంలో వివరణ ఇచ్చారు. 2013 నుంచి ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్ కలుస్తూనే ఉన్నారు. ఒకసారి ఎప్‌స్టీన్ ఇంటిలో రాత్రంతా గేట్స్ గడిపారు. ఈ నేపథ్యంలోనే మిలిందా విడాకుల నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి : గాజాలో పేలుడు- 20 మంది మృతి