క్యూబా పాలనా చరిత్రలో క్యాస్ట్రో శకం ముగియనుంది. ఫిడేల్ క్యాస్ట్రో సోదరుడు రౌల్ క్యాస్ట్రో.. కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఎనిమిదవ కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. తన మిషన్ పూర్తయిందని, మాతృభూమి భవిష్యత్‌పై నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. 1959 నుంచి క్యూబాలో క్యాస్ట్రో కుటుంబమే అధికారం చేపట్టింది.
ఇదే మొదటిసారి..
కమ్యూనిస్టు పార్టీకి తన తర్వాత ఎవరు నాయకత్వం వహిస్తారని క్యాస్టో వెల్లడించలేదు. కానీ 2018లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మిగెల్ డియాజ్ కైనల్ (60)కు పార్టీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు ఇంతకుముందే పేర్కొన్నారు. గత ఆరు దశాబ్దాలకు పైగా క్యాస్ట్రో కుటుంబం క్యూబాను పాలిస్తోంది. మహమ్మారితో దేశం సతమతమవుతున్న ఈ సమయంలో క్యాస్ట్రో కుటుంబం నుంచి మొదటిసారి పార్టీ అధికార బాధ్యతలు ఇతరులకు వెళ్లనున్నాయి. దీంతో క్యూబా భవిష్యత్తుపై దేశ పౌరుల్లో ఆందోళన నెలకొంది.
కరోనా మహమ్మారి, ట్రంప్ విధించిన ఆంక్షలతో క్యూబా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 1990లో సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత మళ్లీ ఆనాటి ఆకలికేకలను ప్రస్తుతం ఆదేశం చవిచూస్తోంది.
ఆర్థిక సరళీకరణల దిశగా..
క్యూబాలో ఒకే ఒక పార్టీ (కమ్యూనిస్టు పార్టీ) వ్యవస్థ ఉంది. ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయటంలో క్యాస్టో కుటుంబం ఆలస్యం చేసినా.. క్యూబా ఏక పార్టీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలిగించకుండా మిగెల్ డియాజ్ కైనల్ గత జనవరిలో ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులకు అవకాశాలు కల్పించారు. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలను చట్టబద్ధం చేశారు.
ఇదీ చదవండి: అమెరికా కాల్పుల మృతుల్లో నలుగురు భారతీయులు
ఇదీ చదవండి: అమెరికాలో విషం చిమ్ముతున్న 'గన్ కల్చర్'