జార్జ్ ఫ్లాయిడ్... అనే నల్లజాతి అమెరికన్ మరణంతో మొదలైన ఆందోళనలు తారస్థాయికి చేరాయి. వేలమంది నల్లజాతీయులు అమెరికా వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఎక్కడ చూసినా విరిగిన కిటికీలు, తగలబడుతున్న భవనాలు, కొల్లగొట్టిన దుకాణాలే దర్శనమిస్తున్నాయి.
- అగ్రరాజ్యంలో దాదాపు 12 నగరాల్లో నిరసనలు మిన్నంటాయి.
- పోలీసుల చేతిలో ఏళ్ల తరబడి ఆఫ్రికన్ అమెరికన్లు నలిగిపోతున్నారని.. 'ఇక వివక్షను సహించబోం', 'వీటితో విసిగిపోయాం' అంటూ నినదించారు నల్లజాతీయులు.
- భవనాలు, గోడలపై ఎక్కడ చూసినా 'ఐ కాంట్ బ్రీత్' (నేను ఊపిరితీసుకోలేపోతున్నాను) అనే మాటలే కనిపిస్తున్నాయి.
- శ్వేతసౌధం దగ్గర్లో ఓ చెత్తకుండీకి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కొంతమంది శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.
- వాషింగ్టన్లో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పోలీసులపై బాటిళ్లు విసిరారు. దుకాణాల కిటికీలను ధ్వంసం చేశారు. స్టోర్‌లో టీవీలు సహా కొన్ని వస్తువులను లూఠీ చేశారు.
- మినియాపొలిస్‌లో రాత్రి 8 తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఆందోళనకారులు లెక్కచేయలేదు.
- నిరసనకారులపై బాష్పవాయువు, రబ్బర్ తూటాలను ప్రయోగించి చెదరగొట్టారు నేషనల్ గార్డ్స్, పోలీసులు, స్టేట్ ట్రూపర్లు.
- ఫిలడెల్ఫియాలో కనీసం నాలుగు పోలీసులు వాహనాలకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. 13 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
- 22 నగరాల్లో దాదాపు 1,669 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో మూడొంతుల మందిని లాస్ ఎంజెల్స్లోనే అదుపులోకి తీసుకున్నారు.
- లాస్ ఏంజెల్స్ గవర్నర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు 10 వేలమంది నేషనల్ గార్డ్స్ నగరంలో గస్తీ కాస్తున్నారు.
- లాస్ ఏంజెల్స్, డెన్వెర్, మియామీ, అట్లాంటా, షికాగో, లూసివిల్లే, మినియాపొలిస్ వంటి దాదాపు 12కు పైగా నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు.
- లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన హింస, విధ్వంసాన్ని 1992 అల్లర్లతో పోల్చుతున్నారు. ఆ సమయంలో 1 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లింది.
- అందోళనకారులను దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్‌తో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. 'నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు.. ఇక ఆటలు సాగవు' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: సమోసా దౌత్యం: మోదీ కోసం వంట చేసిన ప్రధాని