సరదాగా అపరిచితులపై ప్రాంక్ చేయబోయి.. ఓ యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని నాష్‌విల్లె నగరంలో జరిగింది.
ప్రాంక్ కాస్తా విషాదంగా..
యూఎస్‌ఏలోని నాష్విల్లెకు చెందిన 20 ఏళ్ల తిమోతి విల్క్స్ అతడి స్నేహితుడు కలిసి తమ యూట్యూబ్ ఛానల్ కోసం 'దోపిడీ' చేసే ఒక ప్రాంక్ వీడియో రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు వీరిద్దరు కలిసి అడ్వంచర్ పార్క్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రాంక్‌లో భాగంగా గత శనివారం పార్కింగ్ ప్రాంతంలో నిల్చున్న ఓ గుంపును కత్తి చూపించి దోపిడీకి యత్నించారు. అయితే, ఆ గుంపులో ఉన్న 23ఏళ్ల స్టార్న్స్ జూనియర్ అనే వ్యక్తి అది ప్రాంక్ అని తెలియక.. తన వద్ద ఉన్న తుపాకితో కాల్పులు జరిపాడు.
ఆత్మ రక్షణ కోసమే కాల్పులు..
ఈ ఘటనలో తిమోతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. స్టార్న్స్ కేవలం ఆత్మరక్షణ కోసమే తిమోతిపై కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఈ కేసులో ఎవరిపై ఇంకా చర్యలు తీసుకోలేదని.. విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి: అమెరికా హోటల్లో కాల్పుల కలకలం