అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ప్రభుత్వం ఆధీనంలోని శరణార్థ చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. నిద్రించడానికి చోటులేక.. తినడానికి తిండి లేక.. కనీసం తాగడానికి నీరు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... వలసదారుల పట్ల బైడెన్ ప్రభుత్వ విధానం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మీడియాకు అనుమతి లేదు
మెక్సికో సరిహద్దుల్లో ఇలా వలస వచ్చిన 15 వేల మంది చిన్నారులు ప్రస్తుతం ప్రభుత్వం అధీనంలో ఉన్నారు. వీరందరి పరిస్థితి ఎలా ఉందోనని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే... శరణార్థుల శిబిరాలను సందర్శించేందుకు మీడియాకు, స్వచ్ఛంద సంస్థల న్యాయవాదులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.
దక్షిణా టెక్సాస్లోని డొన్న పట్టణంలోని సరిహద్దు వద్ద అదుపులో ఉన్న చిన్నారులకు సంబంధించిన ఫొటోలను అధికార డెమొక్రటిక్ పార్టీకే చెందిన చట్టసభ్యుడు హెన్రీ క్యుల్లర్ విడుదల చేశారు.
"శరణార్థ శిబిరాలకు మీడియాను అనుమతించనందునే నేను ఈ ఫొటోలు విడుదల చేశాను. నిజానికి చిన్నారులను మూడు రోజులకన్నా ఎక్కువ కాలం ప్రభుత్వం అధీనంలో ఉంచకూడదు. కానీ.. ఒక్కోసారి వారం లేదా అంతకన్నా ఎక్కువ సమయం పిల్లలను అదుపులో ఉంచాల్సి వస్తోంది. ఇలా చేయడంలో సరిహద్దు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అందరి దృష్టికి తీసుకురావాలనే నేను ఇలా చేశాను. ఆ చిన్నారులను మన సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరముంది. పిల్లలను అదుపులోకి తీసుకునే విషయంలో ట్రంప్ అనుసరించిన విధానం ఘోరమైంది. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం సదాలోచనతో ఉన్నా... పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి." అని చెప్పారు హెన్రీ.
సరిహద్దుల్లో ఉన్న పిల్లల్ని చూడాడానికి అనుమతించాల్సిందిగా పలు మీడియా సంస్థలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు.
2018లో కొత్త వలస చట్టం తీసుకొచ్చారు ట్రంప్. ఆ చట్టం చాలా మంది చిన్నారులను వారి తల్లిదండ్రల నుంచి వేరు చేసింది. వందల సంఖ్యల కుటుంబాల్ని దక్షిణ టెక్సాస్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. వారికి కనీస సౌకర్యాలను కూడా కల్పించటం లేదు. ట్రంప్ వలస విధానాల్లో భారీ మార్పులు చేస్తున్నట్లు బైడెన్ ప్రకటించినా... సరిహద్దుల్లోని శరణార్థుల పరిస్థితిలో మార్పు రాలేదు.
ఇదీ చదవండి: బైడెన్ సర్కార్కు 'వలస' తలనొప్పులు