Philadephia fire accident: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
US Fire accident killed children
ఫెయిర్‌మౌంట్ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయాని వెల్లడించారు. 60 నిమిషాల లోపే మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ.. ఒక్కటీ పనిచేయలేదని తెలిపారు.
భవనంలోకి ప్రవేశించేందుకు భారీ నిచ్చెనలను అగ్నిమాపక సిబ్బంది వినియోగించారు. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. భవనంలో నుంచి ఓ చిన్నారిని బయటకు తీసి స్ట్రెచర్‌పై తీసుకెళ్లినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
మేయర్ విచారం..
ప్రమాదంలో పిల్లలు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇంటి సమీపంలో ఆడుకునేవారని, అలాంటిది వారు దుర్మరణం చెందడం బాధాకరమని స్థానికంగా నివాసం ఉండే డన్నీ మెక్గీర్ చెప్పారు. ఘటనపై స్థానిక మేయర్ జిమ్ కెన్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కోసం ప్రార్థించాలని అన్నారు.
ఇదీ చదవండి: మాస్కు ధరించమంటే.. బట్టలు విప్పేసి యువతి హల్చల్