కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ సమయంలోనే వ్యాక్సిన్ పరిశోధనలో ముందున్న మూడు కంపెనీలు.. ఓ సంయుక్త ప్రకటన చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమ వ్యాక్సిన్ సురక్షితమైందని, సమర్థంగా పనిచేస్తుందని నిరూపితమయ్యే వరకూ ప్రభుత్వం ఆమోదం కోసం సంప్రదించవద్దని.. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ప్రజాప్రతిజ్ఞ చేయనున్నట్లు సమాచారం.
క్లినికల్ ప్రయోగాలతోపాటు వ్యాక్సిన్ తయారీలో అత్యున్నత శాస్త్రీయ పద్ధతులు, నైతిక ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పనున్నాయి ఆయా తయారీ సంస్థలు. ఇందులో భాగంగానే ప్రజా ప్రతిజ్ఞ చేసేందుకు సిద్ధమైనట్లు ది వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనికి సంబంధించిన ముసాయిదా గురించి చెప్పిన సదరు వార్తా సంస్థ.. రానున్న వారంలోనే ఈ కంపెనీలు హామీ ప్రకటన చేయనున్నట్లు తెలిపింది.
ట్రంప్ వల్లేనా...?
అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు నవంబర్ 3న జరగనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ఆయా కంపెనీలపై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందనే ఆందోళన మొదలైంది. వీటిని ఖండించిన వైట్‌హౌజ్ కూడా అలాంటి ఒత్తిడి ఏమీ లేదని స్పష్టంచేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి కంపెనీలు ఈ సంయుక్త ప్రకటనకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఆస్ట్రాజెనికా, ఫైజర్, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి.