ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ విధానంలో (Vitro Fertilization) శిశువుకు జన్మనిచ్చిన ఇద్దరు దంపతులు.. పుట్టింది తమ బిడ్డ కాదని తెలుసుకొని కోర్టును ఆశ్రయించారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు (Embryo mix up California) చెందిన డాఫ్నా కార్డినేల్, అలెగ్జాండర్ ఈ మేరకు వ్యాజ్యం దాఖలు చేశారు. 2019లో తాము జన్మనిచ్చిన చిన్నారి.. తమ బిడ్డ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పుట్టిన చిన్నారి తమ బిడ్డ కాదని మొదటి నుంచి డాఫ్నా, అలెగ్జాండర్ దంపతులకు అనుమానాలు ఉండేవి. తాము అనుకున్న రంగుతో చిన్నారి జన్మించలేదని ముందు నుంచీ భావించారు. అయితే, పాపను చూసి ప్రేమతో ఈ అనుమానాలన్నింటినీ పక్కనబెట్టారు. చికిత్స చేసిన వైద్యులను, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ విధానంపై నమ్మకంతో వేరే ఆలోచన పెట్టుకోలేదు.
ఒకరి పిండం మరొకరికి...
అయితే, వేరే దంపతుల చిన్నారికి తాను జన్మనిచ్చినట్లు.. బిడ్డ పుట్టిన కొద్దిరోజుల తర్వాత డాఫ్నాకు తెలిసింది. మరో మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకుంది. దీంతో లాస్ ఏంజెలిస్లోని కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రీప్రొడక్షన్ హెల్త్ (సీసీఆర్హెచ్)తో పాటు ఆ క్లినిక్ యజమానిపై దావా వేశారు దంపతులు. ఒప్పంద ఉల్లంఘన, నిర్లక్ష్యం, మోసం, వైద్యపరమైన దుష్ప్రవర్తన వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. సీసీఆర్హెచ్ పొరపాటుగా.. ఇతర దంపతుల పిండాన్ని డాఫ్నాకు (Embryo mix up) అమర్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిండాన్ని మరో మహిళకు అమర్చారని ఆరోపించారు. దీనిపై జ్యూరీ విచారణ చేపట్టనుంది.
డీఎన్ఏ టెస్టుతో స్పష్టత
డాఫ్నాతో పాటు మరో మహిళ సైతం ఆడబిడ్డకే జన్మనిచ్చారు. 2019 సెప్టెంబర్లో వారం వ్యవధిలో వీరు జన్మించారు. మూడు నెలల తర్వాత డీఎన్ఏ పరీక్షలు చేసి ఆయా శిశువులు తమ పిల్లలు కాదని ఇరువురు దంపతులు నిర్ధరించుకున్నారు. ఈ వ్యవహారంలో మరో దంపతులు తమ వివరాలను గోప్యంగా ఉంచారు. క్లినిక్పై ఇదే తరహా వ్యాజ్యాన్ని వారు కూడా దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
పెంచిన చిన్నారిపై డాఫ్నాతో పాటు ఆమె పెద్ద కూతురు బాగా ప్రేమ పెంచుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడేళ్లు ఉన్న ఆ పెద్ద కూతురికి.. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా అవస్థలు పడ్డామని డాఫ్నా దంపతులు చెబుతున్నారు.
సొంత తల్లుల దగ్గరకు..
2020 జనవరిలో ఈ ఇద్దరు దంపతులు తమ పిల్లలను మార్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు తమ సొంత తల్లుల దగ్గరే ఉన్నారు. నలుగురు తల్లిదండ్రులు ఒకే దగ్గర పెద్ద కుటుంబంలా కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని డాఫ్నా తెలిపారు.
ఇదీ చదవండి: సొంత వీర్యంతో రోగులకు గర్భం- వైద్యుడి నిర్వాకం!