అఫ్గానిస్థాన్‌లో అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన యుద్ధాన్ని (US war in Afghanistan) వ్యూహాత్మక వైఫల్యంగా అభివర్ణించారు అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్ మిలే. అఫ్గాన్‌లో ప్రభుత్వం (Afghanistan Government 2020) కుప్పకూలకుండా ఉండేందుకు 2,500 మంది జవాన్లను ఆ దేశంలో (US forces in Afghanistan) ఉంచాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్, సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీతో కలిసి.. సెనేట్ సాయుధ సేవల కమిటీకి ఈ వివరాలు వెల్లడించారు. అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించిన తీరుపై కమిటీలోని సెనేటర్లు కఠిన ప్రశ్నలు సంధించారు.
"ఇలాంటి యుద్ధాల్లో వ్యుహాత్మక వైఫల్యాల వల్ల వచ్చిన ఫలితం.. 20 ఏళ్ల సంయుక్త ప్రభావం అని చెప్పొచ్చు. దీనిపై పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది."
జనరల్ మార్క్ మిలే, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్
సైనికాధికారులు చేసిన సిఫార్సులను అధ్యక్షుడు పరిగణనలోకి తీసుకున్నారని రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. సెనేట్ కమిటీకి తెలిపారు. అధ్యక్షుడికి తాను ఇచ్చిన సలహాలను బహిరంగంగా వెల్లడించలేనని, అయితే అన్ని విధానపరమైన కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. సలహాలు, సిఫార్సులు అందించే అవకాశం అందరికీ ఇచ్చినట్లు చెప్పారు. అందరి నుంచి సమాచారం అందుకున్నట్లు స్పష్టం చేశారు.
వెనకేసుకొచ్చిన వైట్‌హౌస్!
ఈ నేపథ్యంలో స్పందించిన శ్వేతసౌధం.. అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాన్ని (Joe Biden news) సమర్థించింది. "స్పష్టమైన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని అధికారులను అధ్యక్షుడు ఆదేశించారు. అనేక సిఫార్సులను బైడెన్ తన సలహాదారుల నుంచి విన్నారు. కొన్నింటిని స్వాగతించారు. చివరగా.. సైన్యాధ్యక్షుడిగా ఇది అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం. 20 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉపసంహరణ జరపకపోయి ఉంటే.. అక్కడ మన జవాన్ల సంఖ్య పెరిగేది. తాలిబన్లతో యుద్ధం (Taliban war) వచ్చేది. ఎంతో మంది ప్రాణాలు పోయేవి. అధ్యక్షుడు ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. అది అమెరికన్లకు, అమెరికా సైన్యానికి ప్రయోజనకరం కాదని భావించారు" అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి వివరించారు.
పాకిస్థాన్ వల్లే...
మరోవైపు, అఫ్గానిస్థాన్‌లో అమెరికా వైఫల్యానికి ప్రధాన కారణం పాకిస్థానే (Pakistan role in Afghanistan) అని సెనేటర్ జాక్ రీడ్ అన్నారు. తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు ఇవ్వకుండా అమెరికా అడ్డుకోలేకపోయిందని చెప్పారు.
అఫ్గాన్ ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవాలన్నా ఇప్పుడు పాకిస్థాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని మరో సెనేటర్ జిమ్ ఇన్హోఫే పేర్కొన్నారు.
'ఆంక్షలు విధించండి'
మరోవైపు, అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని 22 మంది రిపబ్లికన్ సెనేటర్లు ఓ బిల్లును ప్రవేశపెట్టారు. తాలిబన్లతో పాటు ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చే అన్ని దేశాలపై ఆంక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2001-2020 మధ్య తాలిబన్లకు పాకిస్థాన్ అందించిన సాయంపైనా దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. పంజ్‌షేర్ లోయలో తాలిబన్ల దురాక్రమణకు పాక్ మద్దతు వార్తలపైనా విచారణ జరగాలని అన్నారు.
అదేసమయంలో చైనా, రష్యా దేశాల ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. దౌత్య, ఆర్థిక, రక్షణ పరంగా ఏ విషయంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
దిక్కుతోచని పరిస్థితిలో పాక్
మరోవైపు, అంతర్జాతీయ సమాజం తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించనందున.. వారికి పాకిస్థాన్ సహాయం అందించలేకపోతోంది. అఫ్గాన్‌లో తాలిబన్ సర్కారుకు సాయం చేసే అంశంపై పాకిస్థాన్ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమయ్యారు. అంతర్జాతీయ సమాజం ఈ ప్రభుత్వాన్ని గుర్తించని నేపథ్యంలో ఏ విధంగా సహకారం అందించవచ్చనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచించారని డాన్ పత్రిక తెలిపింది.
ఇదీ చదవండి: