కెనడాలోని ఓ మోస్ట్ వాంటెడ్ నేరస్థుడి విచిత్ర కథ ఇది. మూడేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ.. ఫేస్బుక్లో ఓ మెసేజ్ పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. అతడున్న ప్రదేశాన్ని జీపీఎస్ సాయంతో కనుగొన్న పోలీసులు.. చేతులకు సంకెళ్లతో సత్కారం చేశారు.
జెస్సీ డీన్ కొవాల్చక్.. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రానికి చెందినవాడు. మూడు వేర్వేరు నేరాల్లో నిందితుడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పక్క రాష్ట్రమైన ఆల్బెర్టాకు పారిపోయాడు. మూడేళ్లు గడిచింది. అంతా మరచిపోయి ఉంటారని సంతోషంగా ఉన్నాడు జెస్సీ.
ఇంతలో ఓ టీవీ వెబ్సైట్ జెస్సీ ఫొటోతో ఓ వార్తా కథనం ప్రచురించింది. అది చూసిన అతడు ఆ సంస్థకు "నేను అల్బెర్టాలోని ఎడ్మాంటన్లో ఉన్నాను. నేను తిరిగి రాను." అని ఫేస్బుక్లో మెస్సేజ్ పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఎడ్మాంటన్కు వెళ్లి పని ముగించారు.
"జెస్సీ మెసేజ్ పెట్టి మాకు సాయం చేయటం సంతోషంగా ఉంది. అతనిపై అల్బెర్టాలో వారెంట్ జారీ చేసి బ్రిటిష్ కొలంబియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకున్నాం."
-జోడీ షెల్కీ, ఫెడరల్ పోలీస్ అధికారి
ఇదీ చూడండి: ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!