కరోనా మహమ్మారితో పాటు అమెరికా అధ్యక్ష పదవిని తీవ్రంగా పరిగణించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. మిషిగన్‌లోని ఫ్లింట్, డెట్రాయిట్లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కరోనా విలయంతో దేశం అతలాకుతలమవుతుంటే ట్రంప్ వేరే విషయాలపై దృష్టిసారిస్తున్నారని దుయ్యబట్టారు.
అమెరికాకు జో బైడెన్ గొప్ప అధ్యక్షుడు అవుతారని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. బైడెన్‌ను సోదరుడిగా సంబోధించారు.
"చిన్నప్పుడు అతని(ట్రంప్) పుట్టినరోజు పార్టీకి ఎవరూ రాలేదా? దానికి బాధపడ్డారా? ఈ దేశం మహమ్మారి విలయం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో మీరు అలాంటి వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు."
-బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
నా తండ్రి యోధుడు: ఇవాంక
మరోవైపు ట్రంప్‌కు మద్దతుగా ఆయన కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఓహియో ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ ఓ పోరాట యోధుడని అన్నారు. దేశానికి ఆయన చెప్పినదానికంటే ఎక్కువగానే చేశారని చెప్పారు. నాలుగు సంవత్సరాలుగా అమెరికాను సరైన దారిలో ట్రంప్ నడిపించారని తెలిపారు. అదేసమయంలో ఇదివరకు అధ్యక్షులు చేసిన తప్పులను సరిదిద్దారని అన్నారు.
"శ్వేతసౌధంలో మరో నాలుగు సంవత్సరాల పాటు ఓ యోధుడు ఉండటం గతంలోకంటే ఇప్పుడు చాలా అవసరం. మనకోసం నా తండ్రి ప్రతీరోజు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన కోసం మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. మీ సహాయంతో నవంబర్ 3న మరో చరిత్రాత్మక విజయం సాధిస్తాం. అమెరికాను ఎన్నడూ లేనంత గొప్పగా తీర్చిదిద్దుతాం."
-ఇవాంకా ట్రంప్, అమెరికా అధ్యక్షుడి సలహాదారు
ట్రంప్ తరహాలోనే డెమొక్రాటిక్ పార్టీపై విరుచుకుపడ్డారు ఇవాంక. అమెరికాను సామ్యవాద దేశంగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి- 2016తో పోలిస్తే భారీ విజయం ఖాయం: ట్రంప్