డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న జో బిడెన్ ఎన్నికల ప్రచారం కోసం 7.6 మిలియన్ డాలర్ల(రూ.57కోట్ల 45లక్షలు) విరాాళాలు సమీకరించారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. వర్చువల్ ఫండ్ రైసర్ ద్వారా లక్షా 75వేల మంది దాతల నుంచి రికార్డు స్థాయిలో ఇంత భారీ మొత్తాన్ని సేకరించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దగల సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు తన మిత్రుడు బిడెన్ అని చెప్పారు ఒబామా. బిడెన్‌కు మద్దతుగా మున్ముందు మరిన్ని ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఒబామా బృందం తెలిపింది. బిడెన్ విజయం కోసమే కాకుండా చట్టసభలో, ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొంది.
ఒబామా ప్రచారంతో బిడెన్‌కు కలిసివస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నల్లజాతీయులు, యువత నుంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
ఏప్రిల్‌లో వీడియో సందేశం ద్వారా బిడెన్‌కు మద్దతు ప్రకటించారు ఒబామా. జాతీయ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. జార్జి ఫ్లాయిడ్ మృతి అనంతరం దేశంలో పౌర అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రజల మధ్యకు వస్తున్నారు. పోలీసు విధానాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని గళమెత్తారు. ఫ్లాయిడ్ మృతి అనంతరం ఒబామా ప్రజల్లోకి రావడం పార్టీకి, బిడెన్‌కు సానుకూలంగా మారుతుందని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
బిడెన్‌కు ఒబామా మద్దతు తెలపడాన్ని ట్రంప్ వర్గీయులు తమకు సానుకూలంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. ఒబామా హయాంలో అనుసరించిన విధానాలు అమెరికా మధ్యతరగతి ప్రజలు, విదేశీ ప్రయోజనాలను బలహీనపరిచాయనే ఆరోపణలను వారు తెరపైకి తీసుకొస్తున్నారు.