బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అగ్రదేశానికి, భారత్‌కు మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. 2015లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరయ్యారు. భారత్‌కు రెండు సార్లు విచ్చేసిన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కావడం విశేషం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఒబామా స్నేహం చేయడానికి ఓ బలమైన కారణముందని ఆయన హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న బెంజమిన్ రోడ్స్ తెలియజేశారు.
2014 చివరిలో అప్పటి ఒబామా ప్రభుత్వానికి చైనాకి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలి. ఈ పరిణామంతో ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి అడుగులు పడ్డాయి.
ప్రపంచంలోనే ఎక్కువ శాతం ఉద్గారాలు వెలువరించే చైనా, అమెరికా ఒప్పందం చేసుకోవడం వల్ల ఇతర దేశాలు ప్యారిస్ ఒప్పందానికి ఒక్కొక్కటిగా అంగీకారం తెలిపాయి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అప్పటికి భారత్ ప్యారిస్ ఒప్పందానికి అంగీకారం తెలపకపోవడం.
ఒబామా చొరవ...
ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి భారత్‌ను ఒప్పించడానికి ఒబామా తెలివిగా వ్యవహరించారని రోడ్స్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో భారత గణతంత్ర దినోత్సవానికి అతిథిగా రావాలని ఒబామాకు మోదీ ఆహ్వానం పలికారు.
భారత్‌కు అమెరికా అధ్యక్షుడు వచ్చేముందు స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ (ఎస్ఓటీయూ)కు తెలపాలి. ఒబామా ముఖ్య సలహాదారులు మోదీ ఆహ్వానాన్ని సమ్మతించాలని సూచించారు. ఎందుకంటే ప్యారిస్ ఒప్పందం కుదరాలంటే భారత్‌ను అందుకు ఒప్పించాలి. భారత్ ఒప్పుకోవాలంటే మోదీతో సన్నిహితంగా మెలగాలని వారు ఒబామాకు సలహా ఇచ్చారు.
ప్యారిస్‌లో భారత బృందానికి ఒబామాకు మధ్య సుమారు అరగంట చర్చ జరిగింది. ఎంతకూ చర్చ కొలిక్కిరావడం లేదు. ఆ సమయంలో మోదీ అక్కడకు వచ్చారు. 'భారత్‌లో 30 కోట్ల మంది ఇప్పటికీ విద్యుత్ లేక అంధకారంలో జీవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మీరు నన్ను బొగ్గు వినియోగించ రాదు, ఒప్పందానికి ఒప్పుకోండి అంటే ఎలా?' అంటూ అభ్యంతరం తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా ఆ సందర్భంలో ఒబామా తన జాతి గురించి ప్రస్తావించారని రోడ్స్ తెలిపారు. 'నల్లజాతీయుడిగా పుట్టినప్పటికీ అమెరికాకు అధ్యక్షుణ్ని కాగలగిగాను. పరిస్థితులను అర్థం చేసుకోగలను. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదు' అని ఒబామా అన్నారు.
మోదీ చెప్పిన విద్యుత్ సమస్యకు ఒబామా పరిష్కారం చూపారు. భారత్‌లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా ప్రణాళికలను మోదీకి వివరించారు. ఇంకేముంది మోదీ ప్యారిస్ ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు.
మోదీతో ఒబామా మంచి స్నేహాన్ని పెంచుకున్నారు. తద్వారా భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ను ప్యారిస్ ఒప్పందానికి అంగీకరించేలా చేయగలిగారు.
ఇదీ చూడండి: ప్రియాంక దుర్యోధనుడి కథకు 'అర్జునుడి' కౌంటర్