ప్రస్తుత కరోనా కల్లోలం నేపథ్యంలో పోషకాహారం తీసుకోవడం అత్యవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన వెబ్‌సైట్‌లో ప్రజలకు వివరించింది. ‘ఎలాంటి ఆహారంతోనూ కొవిడ్‌ను అప్పటికప్పుడు తగ్గించలేం. కానీ మనలోని వ్యాధినిరోధక శక్తిని మాత్రం గణనీయంగా పెంచుకోవచ్చు. పైగా ఊబకాయం, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ల నుంచి కాపాడుకోవచ్చు. సమతుల ఆహారం పిల్లల్లో సరైన ఎదుగుదలకు, పెద్ద వారు మరింత ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది’ అని స్పష్టంచేసింది. ఏమేం తినాలో చెబుతూ సూచనలు చేసింది.
భోజనంలో భిన్నత్వం
రోజూ తినే ఆహారంలో బియ్యం, జొన్నలు, గోధుమలు వంటి ధాన్యాలతోపాటు చిక్కుడు రకానికి చెందిన గింజలూ ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లతోపాటు పాలు, గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చు. పీచు అధికంగా ఉండే... పాక్షికంగా పాలిష్ చేసిన జొన్నలు, చిరుధాన్యాలు, ఓట్స్, గోధుమలు, బ్రౌన్‌రైస్‌ను సైతం తరచూ భోజనంలో చేర్చుకోవాలి.
ఉప్పునకు పాతరెయ్యాల్సిందే
ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల(ఒక టీ స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. వంటల్లో ఉప్పు అధికంగా ఉండే సాస్‌లు వాడొద్దు. ప్యాక్ చేసిన సిద్ధ ఆహారం (ప్రాసెస్డ్) తినాల్సి వస్తే వాటికి కూరగాయలు, గింజలు, పండ్లను జతచేసుకోవాలి. ఇలాంటి వాటిని కొనేప్పుడు సోడియం తక్కువగా ఉన్నవాటికే ప్రాధాన్యమివ్వాలి.
పౌల్ట్రీ, చేపలకు ప్రాధాన్యం
వంటల్లో వెన్న, నెయ్యి, కొవ్వులకు బదులు ఆలివ్, సోయా, పొద్దుతిరుగుడు పువ్వులతో చేసిన నూనెలను వాడాలి. కొవ్వు తక్కువగా ఉండే పౌల్ట్రీ, చేపల ఉత్పత్తులను తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకపోవటమే మేలు.
తీపికి దూరంగా జరగండి
తీపి పదార్థాలను అతి తక్కువగా తీసుకోవాలి. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే శీతల ద్రవాలు, పండ్ల రసాలకు బదులు తాజా పండ్లనే తినాలి. పిల్లలకు సైతం ఇలాంటివే అందించాలి. నిత్యం పరిశుభ్రమైన నీటిని సరిపడా తాగాలి.
మద్యం మరింత హానికరం
ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటంతో సమానం. ఇది కొవిడ్-19 నుంచి రక్షణ ఏమీ కల్పించదు. పైగా కాలేయం, గుండె జబ్బులకు, మానసిక అసంతులతకు దారితీస్తుంది. గాయాల పాలవడానికి అవకాశం కల్పిస్తుంది.
చిన్నారులకు రక్షణ ఇలా
చంటి పాపలకు తల్లిపాలు శ్రేయస్కరం. తల్లి కూడా మాస్కులు, సురక్షితమైన దుస్తులు ధరించి, చేతులను చక్కగా శుభ్రం చేసుకుని పిల్లలకు పాలివ్వాలి. చిన్నారులకు ఇచ్చే ఆహారంలో ప్రత్యేకంగా చక్కెర, ఉప్పు వేయొద్దు.
గుర్తుంచుకోండి ఈ 5 సూత్రాలు
1. శుభ్రత పాటించండి.
2. తాజా కూరగాయలు, స్వచ్ఛమైన నీటినే వాడండి.
3. పదార్థాలను పూర్తిగా ఉడికించండి.
4. సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారం భద్రపరచండి.
5. వండిన, వండాల్సిన పదార్థాలను వేరుగా పెట్టండి.
ఇదీ చూడండి: వేడెక్కుతున్న సాగరాలు- భూతాపంతో విపత్తులు