ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మాస్క్‌లు, ఇతర రక్షణ సామగ్రికి కొరత ఏర్పడింది. చివరకు మహమ్మారి బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది కూడా ఈ మస్క్‌లు అందటం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది నర్సులు నిరసనకు దిగారు.
కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ఆసుపత్రికి చెందిన నర్సులు తమకు మాస్క్, ఇతర రక్షణ కిట్స్ అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. మాస్క్‌ల కొరత ఉన్నందున ప్రస్తుతం ఉపయోగిస్తున్న వాటినే మళ్లీ వాడాలని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సోకిన వారికి చికిత్స అందించిన తర్వాత పదేపదే అవే మాస్క్‌లు తిరిగి ఉపయోగిస్తే తమకు కూడా వైరస్ సోకుతుందని వైద్య సిబ్బంది అందరూ భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు మిరియం రజాకి అనే నర్సు.
అమెరికాలో ఇప్పటి వరకు 2,15,000 మందికి వైరస్ సోకగా.. 5 వేల మందికి పైగా మరణించారు.