ఐఫోన్ సురక్షితమని, ఎవరూ హ్యాక్ చేయలేరని భావిస్తున్నారా? అలా అనుకోవడం పొరపాటేనంటున్నారు.. టొరంటో విశ్వవిద్యాలయ(కెనడా) నిపుణులు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపు అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌తో(Pegasus spyware).. పలు దేశాల్లోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, హక్కుల నేతలు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లను హ్యాక్(Phone hacking) చేసిన విషయం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలోనే బహ్రెయిన్‌కు చెందిన 9 మంది హక్కుల కార్యకర్తల ఐఫోన్లు పెగసస్‌కు చిక్కినట్టు టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన సిటిజన్ ల్యాబ్ మంగళవారం వెల్లడించింది. జూన్ 2020- ఫిబ్రవరి 2021 మధ్య బహ్రెయిన్ మానవ హక్కుల కేంద్రం నేతల ఫోన్లు హ్యాక్‌కు గురైనట్టు ల్యాబ్ ధ్రువీకరించింది. తాజా నివేదిక నేపథ్యంలో ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ స్పందించింది.
"మా సంస్థ తయారుచేసిన ఫోన్లపై దాడి చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకవేళ హ్యాక్ చేసినా చాలా స్వల్ప సమయం మాత్రమే వీలవుతుంది. మా పరికరాలకు, డేటాకు ఎప్పటికప్పుడు భద్రత కల్పిస్తాం కాబట్టి.. మెజారిటీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని ఆపిల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఇవాన్ క్రిస్టిక్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు నిర్మలా సీతారామన్ డెడ్‌లైన్.. కారణమిదే!