కరోనా వైరస్ను తుదముట్టించే యాంటీవైరల్ పొర కలిగిన ఒక కొత్త మాస్కును డిజైన్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. దీన్ని ధరించిన వారి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. నార్త్వెస్ట్రన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు.
కరోనా మహమ్మారిపై పోరుకోసం ఉపయోగిస్తున్న వ్యక్తిగత రక్షణ ఉపకరణాల్లో(పీపీఈ) మాస్కులు చాలా ముఖ్యమైనవి. వీటిని ధరించిన వారిని రక్షించడమే కాకుండా.. సదరు వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల బారి నుంచి ఇతరులనూ అవి కాపాడతాయి. ఆ తుంపర్లను అడ్డుకోవడం లేదా దారి మళ్లించడం వంటివి చేస్తాయి. అయినా కొన్ని బయటకు వస్తూనే ఉంటాయి. అవి నేరుగా ఇతరులకు ఇన్ఫెక్షన్ కలిగించొచ్చు. లేదంటే.. ఉపరితలాలపై పడి, పరోక్షంగానూ వైరస్ను వ్యాప్తి చేయవచ్చు.
ఆ రసాయనాల పూతతో వైరస్ ఫట్..
ఈ నేపథ్యంలో మాస్కుల నుంచి తప్పించుకొనే తుంపర్లను శుద్ధి చేసి, వాటిలోని వైరస్లను వేగంగా నిర్వీర్యం చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అనేక ప్రయోగాలు నిర్వహించాక.. పాస్ఫారిక్ ఆమ్లం, కాపర్ లవణాన్ని ఎంచుకున్నారు. ఈ రెండు రసాయనాలకు ఆవిరయ్యే లక్షణం లేదు. అందువల్ల శ్వాసలోకి ఇవి ప్రవేశించే అవకాశం లేదు. వీటిని మాస్కులపై పూసినప్పుడు.. వైరస్లకు ప్రతికూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయని తేల్చారు పరిశోధకులు. ''వైరస్ నిర్మాణాలు చాలా సున్నితమైనవి. ఏదైనా భాగంలో లోపం తలెత్తితే.. ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేసే సామర్థ్యం వాటికి తగ్గిపోతుంది.'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన జియాక్షింగ్ హువాంగ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి- 'మోడెర్నా ప్రయోగాత్మక వ్యాక్సిన్ వచ్చేస్తోంది'