చైనా వల్ల వాణిజ్య రంగంలో తమ దేశం ఏటా 500 బిలియన్ డాలర్లు నష్టపోతోందని, ఇకపై అలా జరగనివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
"అమెరికా చాలా ఏళ్లుగా వాణిజ్యంలో ఏడాదికి 600 నుంచి 800 బిలియన్ డాలర్లు నష్టపోతోంది. చైనా వల్లనే 500 బిలియన్ డాలర్లు కోల్పోతున్నాం. ఇకపై మేము అలా జరగనివ్వం. చైనా ఎగుమతులపై విధిస్తున్న 10 శాతం పన్నులు శుక్రవారం నుంచి 25 శాతానికి చేరుకుంటాయి. 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై ఇంకా ఎలాంటి పన్నులు లేవు. అయితే త్వరలోనే వాటిపై పన్నులు 25శాతానికి చేరుకుంటాయి."- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వాణిజ్య చర్చలను ఉద్దేశపూర్వకంగా చైనా ఆలస్యం చేస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ట్వీట్లతో డ్రాగన్ దేశంపై ఆయన విరుచుకుపడుతున్నారు.
అందుకే చర్చలు ఆలస్యం
అమెరికాతో కీలకమైన వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్కు వెళ్లడానికి తమ వాణిజ్య ప్రతినిధి సిద్ధమవుతున్నారని చైనా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే చైనా ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం అదనంగా 200 బిలియన్ డాలర్ల పన్నులు విధించిందని, అందుకే వాణిజ్య చర్చల పురోగతి నెమ్మదించిందని తెలిపారు.
' వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో సంప్రదింపులకు చైనా మళ్లీ ప్రయత్నిస్తున్నందున చర్చలు కొనసాగుతున్నాయి. కానీ చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా ఉపాధ్యక్షుడు లి హీ.. అమెరికాతో జరగాల్సిన చివరి దఫా వాణిజ్య చర్చలను రద్దు చేసుకున్నారని కొన్ని అమెరికా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఇదీ చూడండి: బ్రిటన్ యువరాజు నివాసంలో బుడిబుడి అడుగులు