కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది న్యూయార్క్ నగరం. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైంది. ఇప్పటికీ నగరంలో దుకాణాలు పాక్షికంగా తెరుచుకునేందుకు అధికారులు అనుమతించడం లేదంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నగరంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆర్థిక, ఇతర కార్యకలాపాలను పాక్షికంగా పునరుద్ధరిస్తామని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లేసియో తెలిపారు. జూన్ రెండోవారంలో రీఓపెనింగ్ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏడు ఆరోగ్య ప్రమాణాల లక్ష్యాన్ని చేరుకుంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వాటిని సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన ఏడు లక్ష్యాలు
- మరణాల రేటు మూడురోజుల సగటును దాటకూడదు.
- రోజుకు ఐదుకు మించి మరణాలు ఉండకూడదు.
- లక్షమంది నివాసితులకు రెండు కేసులు మాత్రమే నమోదు కావాలి.
- ఆస్పత్రులలో 30 శాతం పడకలు అందుబాటులో ఉండాలి.
- ఐసీయూలలో 30శాతం పడకలు ఖాళీగా ఉండాలి.
- టెస్టింగ్ సామర్థ్యం పెరగాలి.
- కాంటాక్ట్ ట్రేసింగ్ పెరగాలి.
ఈ లక్ష్యాల్లో కొన్నింటిని ఇప్పటికే సాధించినట్లు, త్వరలోనే అన్నిటినీ సాధించనున్నట్లు న్యూయార్క్ గవర్నర్ కౌమో చెప్పారు. రీఓపెనింగ్ తర్వాత ఎలాంటి ఆంక్షలు ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
న్యూయార్క్‌లోని ఆరు ప్రాంతాల్లో.. పైన పేర్కొన్న ఏడు లక్ష్యాలు సాధించామని, సెంట్రల్ న్యూయార్క్, ది నార్త్ కంట్రీ, ఫింగర్ లేక్స్, సౌతర్న్ టైర్, వెస్టర్న్ న్యూయార్క్, మోహాక్ వ్యాలీలో మొదటి విడత కార్యకలాపాల పునురుద్ధరణ ఈ వారం చివరిలోగా ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
న్యూయార్క్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 3,51,371గా ఉంది. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 28వేల మందికి పైగా మరణించారు.