అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. సగటున రోజుకు 43,000 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది ఆగస్టు తొలినాళ్లతో పోల్చితే 21 శాతం తక్కువ. అయినా మరణాలు మాత్రం రోజుకు దాదాపు 1000 సంభవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్, భారత్లో మాత్రమే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గడానికి మాస్కుల వాడకమే కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణులు డా.మోనికా గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఆహ్వానించదగిందని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన పెరిగిందని, మాస్కులు ధరించడం, రోగ నిరోధక శక్తి పెరగడమే కొత్త కేసులు తగ్గడానికి కారణమన్నారు.
అయితే కరోనా పరీక్షలు అవసరమైనన్ని నిర్వహించకపోవడమూ కేసుల సంఖ్య తగ్గడానికి కారణమని డా.జొనాతన్ క్విక్ తెలిపారు. రోజుకు సగటున 40 లక్షల టెస్టులు నిర్వహించాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 43 వేల కేసులంటే చాలా ఎక్కువేనని, ఒకప్పుడు సగటున 34వేల కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
కరోనా కారణంగా అమెరికానే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఆ దేశంలో 59 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. లక్ష 81వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: రానున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఎవరి పక్షమో?