ఆసుపత్రులు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను క్రిమిరహితంగా మార్చే ఒక తెలివైన రోబో యంత్రాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. కొవిడ్-19పై పోరులో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ఈ సాధనాన్ని ఐఐటీ, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు తయారుచేశారు.
ఈ సాధనానికి 'ఎయిర్‌లెన్స్ మైనస్ కరోనా' అని పేరు పెట్టారు. ఇది 'రేణువుల విద్యుద్దీకరణ' అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీని నుంచి వచ్చే ఆవేశిత లేదా అయనైజ్డ్ నీటి బిందువులు.. ఆక్సీకరణ ద్వారా వైరస్‌లోని ప్రొటీన్లను చంపేస్తాయి.
తద్వారా హానికారక సూక్ష్మజీవులు నిర్వీర్యమవుతాయి. ఆక్సీకరణ అనేది సూక్ష్మజీవులను నిర్మూలించే అత్యంత సమర్థ విధానం. తాజా సాధనంలో అతినీలలోహిత కిరణాలు లేదా రసాయనాల వినియోగం ఉండదు. ఆల్కహాల్ ద్వారా కూడా వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చు. అయితే ఈ పదార్థంతో తయారయ్యే హ్యాండ్ శానిటైజర్లు స్వల్ప స్థాయిలో ఉపరితలాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి.
'ఎయిర్‌లెన్స్ మైనస్ కరోనా' ఎక్కువ విస్తీర్ణంలోని ప్రాంతాలను క్రిమిరహితం చేయవచ్చు. పైగా ఇలా నీటి ద్వారా క్రిమిసంహారం చేయడం చాలా సురక్షితమైన విధానమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మానవ చర్మానికి హాని కలిగించదన్నారు. 'ఎయిర్‌లెన్స్ మైనస్ కరోనా'.. మానవ వినియోగానికి సురక్షితమైనదేనని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) ధ్రువీకరించింది.