కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టులను పెంచి.. సరైన సమయంలో బాధితులను గుర్తించి చికిత్స అందించడమే మేలంటున్నారు వైద్య నిపుణులు. అయితే.. వైరస్‌ను కచ్చితత్వంతో వేగంగా నిర్ధరించగలిగే కిట్లు పెద్దగా అందుబాటులో లేవు.
దీనిని దృష్టిలో పెట్టుకొని.. పరిశోధకులు ఒక కొత్త రాపిడ్ టెస్ట్ కిట్‌ను రూపొందించారు. ప్రామాణిక కొవిడ్-19 నిర్ధరణ పరీక్ష ఫలితాలతో సరిచూస్తే.. ఈ కిట్‌తో 93 శాతం అనుకూలంగా రిజల్ట్స్ వచ్చాయని చెబుతున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు పరిశోధకులు, శాస్త్రవేత్తలు. ఇందులో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందినవారూ ఉన్నారు.
'స్టాప్ కొవిడ్'గా పిలిచే ఈ నిర్ధరణ పరీక్ష కిట్ అతి తక్కువ ధరలోనే లభ్యమవుతుందని, ప్రజలు రోజూ స్వయంగా టెస్టులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు పరిశోధకులు. ఇలాంటి పరీక్షలతో లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారిని త్వరగా గుర్తించవచ్చని.. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని అంటున్నారు.
''ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకోవడం తప్పనిసరి అని మేం భావిస్తున్నాం. ఇది నిత్యజీవితంలో ఒక భాగం అయింది. ఇప్పుడు.. ప్రజలు రోజూ కరోనా పరీక్షలు చేసుకోవచ్చు. ఇది వైరస్ వ్యాప్తిని క్రమంగా తగ్గించగలుగుతుంది.''
- ఒమర్, ఎంఐటీ పరిశోధకుడు
మొత్తం 402 మంది బాధితుల నమూనాలను స్టాప్ కొవిడ్ కిట్‌తో పరీక్షించగా.. 202 నమూనాలు పాజిటివ్‌గా, మరో 200 ఫలితాలు నెగిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. ప్రామాణిక అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం- పీసీఆర్ టెస్ట్ ఫలితాలతో.. వీటిని పోల్చి చూస్తే 93 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు.
త్వరలో ఈ రాపిడ్ టెస్టును.. ఫార్మసీలు, వైద్యుల కార్యాలయాలు, నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలల్లో ఏర్పాటు చేసే దిశగా అభివృద్ధి చేయాల్సిన అంశంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.