వీసాలకు సంబంధించి తీసుకొచ్చిన నూతన విధానాలకు తోడు కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న గడ్డు పరిస్థితులతో అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. అగ్రరాజ్యంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 43 శాతం పడిపోయింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
700 విద్యాసంస్థలపై జరిపిన సర్వేలోని వివరాలు..
- ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మిషిగన్, టెక్సాస్, అరిజోనా, ఓహియో యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదల వరుసగా 20, 17, 15, 15 శాతంగా నమోదైంది.
- అమెరికాలో చేరిన విద్యార్థుల్లో ప్రతి ఐదు మందిలో ఒకరు ఆన్‌లైన్ మాధ్యమంలోనే చదువుతున్నారు.
- కరోనా సంక్షోభం కారణంగా విద్యార్థులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు ఆన్‌లైన్ మాధ్యమంలో చదివే విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ట్రంప్ సర్కారు ఒత్తిడి చేయడం వారిలో ఆందోళనను పెంచింది.
- మహమ్మారి కారణంగా వివిధ దేశాల్లో అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు మూసివేయడం వల్ల కొత్త విద్యార్థులకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. అప్పటికే అమెరికాలో చదువుతూ స్వదేశాలకు వచ్చినవారు ప్రయాణాలపై ఆంక్షల వల్ల తిరిగి వెళ్లలేకపోయారు.
- విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసివేస్తే తమ పిల్లలు ఎక్కడ ఉంటారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాల వద్ద ఆందోళన వ్యక్తంచేశారు.
- కుటుంబ సభ్యులు కరోనాకు గురైనప్పటికీ వారిని చూడటానికి వెళ్లే మళ్లీ తిరిగిరాలేమన్న భయంతో చాలా మంది స్వస్థలాలకు వెళ్లలేదు. అయితే ధైర్యం చేసి వెళ్లినవారిలో చాలా మంది స్వదేశంలోనే చిక్కుకుపోయారు.
- అమెరికాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యార్థులు చైనా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు.
- దీనివల్ల భవిష్యత్తులో ప్రతిభావంతులను కోల్పోవాల్సి వస్తుందని అమెరికా సంస్థలు పేర్కొంటున్నాయి.
ఇదీ చూడండి:అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల్లో 20శాతం భారతీయులే!