భారతీయ-అమెరికన్ నీరా టాండన్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. గత ప్రభుత్వాల్లో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కలిగిన తెలివైన విధానకర్త అని కొనియాడారు. శ్వేతసౌధంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కి డైరెక్టర్గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు బైడెన్.
"ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా నీరా టాండన్ను నామినేట్ చేస్తున్నా. చాలా కాలంగా నీరా నాకు తెలుసు. గత ప్రభుత్వాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కలిగిన తెలివైన విధానకర్త. భారత్ నుంచి వలస వచ్చి ఎన్నో కష్టాలు పడిన ఒంటరి తల్లి వద్ద పెరిగారు నీరా. తన కూతురి కలల సాకారం కోసం ఆమె తల్లి ఎంతో శ్రమించారు. నీరా కూడా అంతే కష్టపడ్డారు. లక్షలాది మంది అమరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అర్థం చేసుకున్నారు. "
- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత
బైడెన్ బృందంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ)కు డైరెక్టర్ హోదాలో బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే ఆర్థిక నిపుణులు, సలహాదారులకు నీరా నేతృత్వం వహించనున్నారు. ఈ క్రమంలో ఓఎంబీకి నీరా టాండన్ తొలి నల్లజాతీయురాలు, తొలి దక్షిణాసియాకు చెందిన మహిళగా పేరుగాంచనున్నారని తెలిపారు బైడెన్. బడ్జెట్ బృందానికి నీరా నేతృత్వం వహించటం ద్వారా కరోనా వైరస్ కట్టడి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. అన్నింటికంటే నేను నమ్ముతున్న దానిని ఆమె నమ్ముతున్నారని.. ఆమె రూపొందించబోయే బడ్జెట్ మా విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు బైడెన్.
బడ్జెట్ బృందానికి నేతృత్వం వహించే అవకాశం రావటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు టాండన్. ఓఎంబీలోని నిపుణులతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ల అభివృద్ధికి తనవంతుగా పాటుపడతానన్నారు.
ఇదీ చూడండి: మరణించిన 12 ఏళ్ల తర్వాత పరిహారం