కరోనా రెండో ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ రకాలను ఎదుర్కొనేలా తమ డోసుల సమర్థతను పెంచుకునేందుకు టీకా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ముక్కులో వేసే నాసల్ స్ప్రే(nasal spray)ల రాకతో.. ఈ మహమ్మారిపై పోరు కొత్తమలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే(ఎన్ఓఎన్ఎస్)ను తయారు చేసింది. ఇది కొవిడ్ బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం మేర నిర్మూలిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఔషధం.. ఎగువ శ్వాస నాళాల్లోని వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. లేకుంటే ఈ వైరస్ తొలుత అక్కడ పాగా వేసి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. ఈ పరిస్థితిని ఎన్ఓఎన్ఎస్ నివారిస్తుంది. కొవిడ్ బారిన పడిన 79 మందిపై ఈ స్ప్రే(nasal spray)ను పరీక్షించారు. దీన్ని వాడిన 24 గంటల్లోనే 95 శాతం మేర వైరల్ లోడు తగ్గిపోయిందని తేల్చారు. 72 గంటల్లో 99శాతం మేర వైరస్‌ను ఇది నిర్మూలించిందని వారు పేర్కొన్నారు.
బ్రిటన్‌లో మొదటి వెలుగు చూసిన కరోనా వైరస్ రకంపై కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని పేర్కొన్నారు. ఎన్ఓఎన్ఎస్ వినియోగానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఇటీవల పచ్చజెండా ఊపాయి. భారత్‌లోనూ దీన్ని ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ సంప్రదింపులు సాగిస్తోంది.
ఇదీ చూడండి: కరోనా పరీక్షలకు ఇక సులువైన విధానం!