నాసా... అంటేనే అంతరిక్షం.. అద్భుతాలు. అసాధ్యం అనుకున్న ఎన్నో అంశాలను సుసాధ్యం చేసిన ఘనత నాసా సొంతం. అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక 'మహిళల స్పేస్‌వాక్' ప్రాజెక్టు ఓ చిన్న కారణంతో నిలిచిపోయింది.
1998లో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పడింది. అప్పటి నుంచి 214 అంతరిక్ష నడక(స్పేస్ వాక్)లను నిర్వహించింది నాసా. కానీ ఇద్దరు మహిళా వ్యోమగాములను మాత్రమే ప్రత్యేకంగా ఎన్నడూ పంపలేదు. గతంలో కేవలం పురుషులు లేదా పురుషులు-మహిళలు కలిసి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. కానీ ఈ సారి పూర్తిగా మహిళలతో అంతరిక్ష నడక నిర్వహించాలని ఇద్దరితో 'మహిళల స్పేస్‌వాక్' ప్రాజెక్టు ప్రారంభించింది నాసా.
ఈ చారిత్రక ప్రాజెక్ట్ కోసం మహిళా వ్యోమగాములు క్రిస్టినా కొచ్, ఆన్ మెక్‌క్లయిన్ శిక్షణ పొందారు. మార్చి 29న అంతరిక్ష ప్రయాణం కోసం సన్నద్ధమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ప్రాజెక్ట్ విజయం సాధిస్తుందనుకున్న తరుణంలో నాసాకు 'స్పేస్ సూట్' రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మెక్క్లయిన్కు తన స్పేస్ సూట్ సౌకర్యంగా లేకపోవడమే ఇందుకు కారణం.
తనకు ఇచ్చిన స్పేస్‌సూట్ సరిగా లేదని, మీడియం సైజు స్పేస్ సూట్ కావాలని మెక్‌క్లయిన్ కోరారు. కానీ ఇంత తక్కువ సమయంలో కొత్త సూట్ అందించడం కుదరదని నాసా చేతులెత్తేసింది. చేసేదేమీ లేక సూట్ మార్చడం బదులు మనిషినే మార్చేసింది.
మక్క్లయిన్ స్థానంలో నిక్ హేగ్ అంతరిక్ష నడక కోసం సిద్ధపడుతున్నాడు. మహిళ స్థానంలో పురుషుడి రాకతో చారిత్రక ప్రాజెక్టు కాస్తా సాధారణ ప్రాజెక్ట్‌గా మారింది. శాస్త్రవేత్తల ఆశలపై 'స్పేస్ సూట్' నీళ్లు చల్లింది.
ఈ విషయంపై జాన్సన్ స్పేస్ సెంటర్ ప్రతినిధి స్పందించారు.
"స్పేస్ సూట్ల సైజు విషయంలో మేము ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. వ్యోమగాములు ఎన్నో విధాలుగా శిక్షణ పొందుతారు. వాటిని దృష్టిలో పెట్టుకునే సూట్ తయారు చేయిస్తాం. కానీ శిక్షణకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లాక దుస్తుల విషయంలో వ్యోమగాముల ఆలోచనలు మారుతాయి."
-బ్రాండి డీన్, జాన్సన్ స్పేస్ సెంటర్