Ryan Coogler bank of America: బ్లాక్ పాంథర్ వంటి బ్లాక్బాస్టర్ సినిమాలు తీసిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ర్యాన్ కూగ్లర్కు చేదు అనుభవం ఎదురైంది. దోపిడీకి వచ్చినట్లు అనుమానించిన బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అమెరికా, జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగులు తప్పుగా భావించి ఇచ్చిన సమాచారం వల్ల ఇలా జరిగినట్లు తెలుసుకుని కొద్ది క్షణాల్లోనే కూగ్లర్ను వదిలేశారు.
ఇదీ జరిగింది..
జనవరి 7న అట్లాంటాలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్‌కు వెళ్లారు డైరెక్టర్ ర్యాన్ కూగ్లర్. నగదు ఉపసంహరణ చేసేందుకు కౌంటర్ వద్దకు వెళ్లారు. సుమారు 12వేల డాలర్ల నగదును ఉపసంహరించేందుకు ప్రయత్నించారు. విత్డ్రాల్ స్లిప్ వెనకాల 'నగదు ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తి ఎవరో రహస్యంగా ఉండండి'(దర్శకుడు కాబట్టి.. ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు) అని నోట్ రాసి ఇచ్చారు. కానీ బ్యాంకు సిబ్బంది మరోలా అర్థం చేసుకున్నారు. వారి కంప్యూటర్లో అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బ్యాంకు దోపిడీకి వచ్చినట్లు భావించిన అక్కడి ఉద్యోగిని.. మేనేజర్‌కు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. బ్యాంకు ముందు బ్లాక్ లెక్సస్ ఎస్యూవీ కారు ఇంజిన్ ఆన్ చేసి ఉండటాన్ని గమనించారు. డ్రైవర్‌ను వివరాలు అడగగా.. తాను కూగ్లర్ కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈ వివరాలు సరిపోలటం వల్ల వెంటనే డ్రైవర్‌తో పాటు అందులోని ఓ మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి సంకెళ్లు వేయలేదు. మరో ఇద్దరు అధికారులు బ్యాంకులోకి వెళ్లి కూగ్లర్కు సంకెళ్లు వేసి బయటకు తీసుకొచ్చారు.
పోలీస్ యూనిఫాంకు ఉన్న కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. క్యాష్ కౌంటర్ వద్ద గ్రే కలర్ టీషర్ట్, బ్లాక్ క్యాప్, సన్‌గ్లాసెస్, తెల్లటి మాస్క్ ధరించి కూగ్లర్ నిలుచుని ఉన్నారు. ఓ అధికారి తుపాకీ తీయగా.. మరో అధికారి చేతులు వెనక్కి పెట్టాలని చెప్పారు. అర్థం కాని డైరెక్టర్.. ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించారు. బ్యాంకులోంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. తాను తన ఖాతాలోంచి నగదు తీసుకునేందుకు వచ్చానని పోలీసులకు తెలిపారు క్లూగర్.
వివరాలు తెలుసుకున్న పోలీసులు.. బ్యాంకు సిబ్బంది తప్పుగా భావించటం వల్ల ఇదంతా జరిగినట్లు గుర్తించారు. వెంటనే కూగ్లర్కు వేసిన సంకెళ్లను తొలగించారు. ఆయన డ్రైవర్, మరో మహిళను సైతం విడిచిపెట్టారు. తమకు అందిన తప్పుడు సమాచారంతోనే ఈ మేరకు సంకెళ్లు వేసినట్లు కూగ్లర్కు వివరించారు పోలీసులు.
నగదు ఇవ్వాల్సి రావటం వల్లే వచ్చా..
తన కోసం పని చేస్తున్న వైద్యురాలికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఆమె నగదు రూపంలోనే ఇవ్వాలని కోరిన నేపథ్యంలో బ్యాంకుకు వచ్చినట్లు వివరించారు కూగ్లర్. కౌంటర్ ద్వారా ఇంత మొత్తం నగదును తీసుకోవటం ద్వారా అభద్రతగా ఉంటుందనే కారణంగానే విత్డ్రాల్ స్లిప్పై రాసి ఇచ్చినట్లు చెప్పారు. 'ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, నా ఖాతా నుంచి డబ్బు తీసుకున్నందుకు తుపాకీ ఎక్కుపెట్టారు' అని ఆందోళన వ్యక్తం చేశారు కూగ్లర్. నగదు ఇచ్చే వ్యక్తి తనకు సమస్య అని చెప్పలేదని, నేరుగా మేనేజర్ గదికి వెళ్లి మాట్లాడిందన్నారు.
అందుకే అనుమానం..
మరో కెమెరాలో బ్యాంకు ఉద్యోగిని జరిగిన విషయాన్ని చెప్పిన దృశ్యాలు రికార్డయ్యాయి. కూగ్లర్ తనకు విత్డ్రాల్ స్లిప్ ఇచ్చారని, ఆయన డెబిట్ కార్డు ద్వారా నగదు తీసుకోవాలని కోరినప్పటికీ.. సమాధానం ఇవ్వకుండా స్లిప్పై నోట్ రాసి ఇచ్చారని చెప్పారు. గుర్తింపు కార్డు అడగగా.. కాలిఫోర్నియాకు చెందిన కార్డు ఇచ్చారని, ఉపసంహరిస్తున్న నగదు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల తనకు అనుమానం వచ్చిందన్నారు. కంప్యూటర్ సైతం హైరిస్క్‌తో కూడుకున్న లావాదేవీగా అలర్ట్ చేసిందని.. దీంతో మేనేజర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ వెంటనే 911కు కాల్ చేశానన్నారు.
బ్యాంకు విచారం..
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదని, కూగ్లర్కు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్‌కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!