అమెరికాలోని మినియాపొలిస్‌లో గతేడాది మృతిచెందిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ కేసులో పురోగతి లభించింది. ఫ్లాయిడ్ కుటుంబసభ్యులకు నష్టపరిహారాన్ని అందించేందుకు మినియాపొలిస్ యంత్రాంగం అంగీకరించింది. మొత్తం 27 మిలియన్ డాలర్లను(సుమారు రూ.196 కోట్లు) నష్టపరిహారంగా చెల్లిస్తామని శుక్రవారం ప్రకటించింది. అందులో 5 లక్షల డాలర్లను ఫ్లాయిడ్‌ను అరెస్ట్ చేసిన ప్రాంతానికి కేటాయిస్తామని పేర్కొంది.
గతేడాది మే 25న.. పోలీస్ ఆఫీసర్ డెరెక్ చౌవిన్ చేతిలో జార్జి ఫ్లాయిడ్ మరణించాడు. మెడపై కాలును గట్టిగా అదిమిపట్టడం వల్ల ఫ్లాయిడ్ మృతి చెందాడు. ఈ ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.
ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ అతని కుటుంబసభ్యులు జూలైలో పౌర హక్కుల దావాను దాఖలు చేశారు. మినియాపొలిస్ పాలనా యంత్రాంగం సహా నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులపై ఈ వ్యాజ్యం వేశారు. ఫ్లాయిడ్ హక్కులకు పోలీసులు భంగం కలిగించారని, వారి వైఖరికి కారణం.. పాలన యంత్రాంగం నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ దావాపై కోర్టు వెలుపల పరిష్కారానికే మొగ్గు చూపిన మినియాపొలిస్ కౌన్సిల్.. ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే న్యాయస్థానంలో మాత్రం చౌవిన్‌పై నమోదైన కేసు విచారణ యథావిధిగా కొనసాగనుంది.
ఇదీ చదవండి : అమెరికా తిరిగి అమేయ శక్తిగా ఎదుగుతోంది: బైెడెన్