అమెరికాలో ఓ పోలీసు అమానుష ప్రవర్తనతో నల్లజాతీయుడు మృతిచెందడంపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటిన వేళ అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నల్లజాతీయుడి మరణానికి కారణమైన పోలీసు అధికారిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు రక్షణ సిబ్బంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
మిన్నియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఓ ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తి మెడపై పోలీసు మోకాలితో తొక్కిపెట్టడం కారణంగా ఊపిరాడక చనిపోయాడు. ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ కారు నుంచి బయటికి రాగానే నేలపైకి పడగొట్టారు. సంకెళ్లు వేసి జార్జ్ మెడపై పోలీసు అధికారి మోకాలు బలంగా ఉంచాడు. ఊపిరి తీసుకోలేకపోతున్నాడంటూ పక్కనే ఉన్న ఓ వ్యక్తి గట్టిగా అరిచినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించిన కాసేపటికే జార్జి మరణించినట్లు తెలిపారు. ఘటనా సమయంలో అక్కడే ఉన్న నలుగురు అధికారులను బాధ్యులను చేస్తూ ఇప్పటికే విధుల నుంచి తొలగించారు.
మిన్నంటిన నిరసనలు..
ఈ ఘటనపై గత రెండురోజులుగా మిన్నియాపొలిస్‌లో నల్లజాతీయులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం సహా... ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కొన్నిచోట్ల లూటీలు... కూడా జరుగుతున్నాయి. మిన్నియాపొలిస్, అట్లాంటా, వాషింగ్టన్ సహా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.
ట్రంప్ హెచ్చరికలు..
రక్షణ సిబ్బంది కారణంగా వ్యక్తి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు ట్రంప్. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, నిరసనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు శాంతించకపోతే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ట్రంప్ బెదిరింపులు.. రాజకీయ హింసకు ప్రతీక'