ఈఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజీ ఈమెయిల్ సర్వర్ సాఫ్ట్వేర్ హ్యాకింగ్ అమెరికా, ఐరోపా దేశాల్లో సంచలనంగా మారింది. వేలాది కంప్యూటర్లపై దాడి వెనుక ఉన్నది చైనానేనని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన విభాగం ఆరోపించింది.
అమెరికాతో పాటు దాని భాగస్వామ్య దేశాలు ఇతర సైబర్ దాడులు సైతం బీజింగ్ నుంచే జరిగాయని ఆరోపించాయి. అందులో ముఖ్యంగా సంస్థలను లక్ష్యంగా చేసుకుని మిలియన్ల డాలర్లు డిమాండ్ చేసిన రాన్సమ్వేర్.. ప్రభుత్వ గుర్తుంపు పొందిన హ్యాకర్ల పనేనని పేర్కొన్నాయి. చైనా రక్షణ శాఖ క్రిమినల్ కాంట్రాక్ట్ హ్యాకర్స్‌ను వినియోగించి సైబర్ దాడులు చేస్తోందన్నారు అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు. హ్యాంకింగ్పై దర్యాప్తు జరుగుతున్న తీరును వివరించారు.
మరోవైపు.. నలుగురు చైనా దేశస్థులపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం సోమవారం ప్రకటించింది. వారు చైనా రక్షణ శాఖ హ్యాంకింగ్ విభాగంలో పని చేస్తూ.. డజన్ల కొద్ది కంప్యూర్ సిస్టమ్స్, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది.
చైనాపైనే ఐరోపా, బ్రిటన్ ఆరోపణ..
సైబర్ దాడులు పెరిగిపోతున్న క్రమంలో వాటికి కారణం చైనానేనని యురోపియన్ యూనియన్, బ్రిటన్లు సైతం ఆరోపించాయి. 27 దేశాల్లోని ప్రభుత్వ, రాజకీయ సంస్థలు, కీలక పరిశ్రమలే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ దాడుల వెనుక చైనా హ్యాకర్స్ ఉన్నట్లు పేర్కొంది ఐరోపా. అమెరికా, యూరప్‌లోని సముద్ర ఉత్పత్తుల పరిశ్రమలు, నౌకాదళ రక్షణ కాంట్రాక్టర్లపై సైబర్ దాడి జరిగినట్లు యూకే జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం తెలిపింది. 'మేధో సంపత్తి చోరీ, గూఢచర్యం కోసం చైనా భూభాగం నుంచే హ్యాకింగ్ జరిగింద'ని ఓ ప్రకటన జారీ చేశారు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బొరెల్.
మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజీ హ్యాకింగ్ ఈఏడాది జనవరిలో గుర్తించారు. ఆ తర్వాత చాలా ప్రైవేటు సంస్థలు వేగంగా చైనా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. ఈ క్రమంలోనే సైబర్ దాడుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు ప్రత్యేక వ్యూహాలు, మార్గాలను సూచించింది ఎఫ్‌బీఐ, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ. సైబర్ దాడులపై చైనాను బాధ్యులుగా చేసేందుకు అంతర్జాతీయ కూటమికి పిలుపునిచ్చింది శ్వేతసౌధం.
ఖండించిన చైనా..
మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజీ హ్యాకింగ్ అంశాన్ని ఖండించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి. 'ఈ అంశాన్ని చైనా ఖండిస్తోంది. సైబార్ దాడులు, సైబర్ తెఫ్ట్లపై మేం పోరాడుతున్నాం. ఆధారాలు ఉంటేనే నిందించాలి కానీ, నిరాధారమైన ఆరోపణలతో కాదు' అని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పంథా మార్చిన సైబర్ క్రైమ్స్- ఇలా జాగ్రత్తపడండి..