అమెరికా ప్రజల సంక్షేమం కన్నా.. సొంత ప్రయోజనాలపైనే డెమొక్రాట్లు అధికంగా శ్రద్ధ చూపిస్తున్నారని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆరోపించారు. పెన్సిల్వేనియాలో అధ్యక్షుడి తరపున తొలిసారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మెలానియా.
కరోనా నియంత్రణలో ట్రంప్ రికార్డు మెరుగ్గానే ఉందని కొనియాడారు మెలానియా. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌పై విమర్శలు చేశారు. బైడెన్ సామ్యవాద అజెండా అమెరికాను నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా వార్తా సంస్థల తీరునూ తప్పుబట్టారు.
"బైడెన్ రాజకీయాలు, ఆయన సామ్యవాద అజెండా.. గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన పురోగతితో పాటు అమెరికాను నాశనం చేసేందుకే ఉపయోగపడుతుంది. కాబట్టి మనమంతా డొనాల్డ్‌ను శ్వేతసౌధంలోనే ఉంచాలి. అలా చేస్తే ఆయన ప్రారంభించిన పనులను పూర్తి చేయొచ్చు. దేశం అభివృద్ధి పథంలో కొనసాగేలా చేయొచ్చు."
-మెలానియా ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ
కరోనా నివారణ కోసం నిజమైన పరిష్కారం కోసం ప్రయత్నించామని పేర్కొన్నారు మెలానియా. భయంతో అన్నీ మూసేసుకోని ఉండలేదని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. మహమ్మారికి తమ ప్రభుత్వం వెన్ను చూపించలేదని అన్నారు. కరోనా సమయంలో సురక్షితంగా కార్యకలాపాలు ఎలా నిర్వహించాలన్న విషయాన్ని పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపారాలు గ్రహించాయని చెప్పారు.