అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన పెర్సీవరెన్స్ రోవర్ గురువారం విజయవంతంగా అరుణగ్రహం మీదకి అడుగుపెట్టింది. అయితే ఈ ప్రయత్నంలో ఓ భారతీయ అమెరికన్ కీలక పాత్ర పోషించారు. ఆవిడే డాక్టర్ స్వాతి మోహన్. రోవర్ నియంత్రణ, ల్యాండింగ్ వ్యవస్థకు స్వాతి సారథ్యం వహించారు. సిస్టమ్స్ ఇంజనీర్‌గా నేతృత్వం వహించడం సహా రోవర్ కదిలకలను పర్యవేక్షించారు. పెర్సీవరెన్స్ రోవర్ మిషన్ కన్నా ముందే ఎన్నో కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఆమె సొంతం. క్యాసినీ పేరుతో శనిగ్రహం మీద, గ్రేయిల్ పేరున చంద్రుడిపై చేపట్టిన మిషన్లలో ఆమె కీలక పాత్ర పోషించారు.
వలస వెళ్లి..
డాక్టర్ స్వాతికి ఏడాది వయసు ఉన్నప్పుడే ఆమె కుటుంబం అమెరికాకు వలస వచ్చారు. బాల్యం అంతా ఉత్తర వర్జీనియా, వాషింగ్టన్ డీసీల్లో గడిచిపోయింది. కోర్నల్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన స్వాతి.. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, పీహెచ్డీ పట్టాలు పొందారు.
ఆ రెండు సందర్భాలు..
డాక్టర్ స్వాతి జీవితంలోని రెండు సంఘటనలు ఆమెను అంతరిక్ష పరిశోధన వైపు మక్కువ చూపేలా చేశాయి. 9 ఏళ్ల వయసులో చూసిన స్ట్రార్ ట్రెక్ అనే చిత్రం అమెను ఖగోళ శాస్త్రంవైపు మొగ్గు చూపేలా చేసింది. కానీ డాక్టర్ స్వాతికి 16 ఏళ్ల వరకు పిల్లల డాక్టర్‌ను కావాలనే ఆలోచనే ఎక్కువ ఉండేది . అయితే అదే సమయంలో ఆమె విన్న తొలి ఫిజిక్స్ క్లాసు, చక్కని బోధనన స్వాతిని అంతరిక్ష రంగంవైపు అడుగులు వేసేలా చేశాయి.
ఇదీ చదవండి : మార్స్‌పై అడుగుపెట్టిన నాసా పెర్సీవరెన్స్ రోవర్