ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా బారి నుంచి బయటపడే మార్గాన్వేషణలో ఉన్నాయి. డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ మూడు నెలల్లోనే ప్రపంచాన్ని ఆవహించింది. తన విషపు కోరల్లో లక్షలాది మందిని బందీలను చేసింది. ఈ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉదాసీనంగా వ్యవహరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నానా యాగీ చేస్తున్నారు. ఆ సంస్థకు నిధులు సైతం నిలిపివేశారు. అయితే తన సొంత నిఘా సంస్థలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని పట్టించుకోలేదని, అందుకే అగ్రరాజ్యంలో సంక్షోభం ఇంత ముదిరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డబ్ల్యూహెచ్ఓ కన్నా ముందే!
కేవలం 30 రోజుల్లో ఈ మహమ్మారి ఓ మోస్తరు సంక్షోభం నుంచి తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటుందని ఫిబ్రవరి 25న అమెరికా వైద్య నిఘా సంస్థ అయిన నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను విశ్వ మహమ్మారిగా ప్రకటించడానికి 15 రోజుల ముందుగానే ఈ హెచ్చరికలు వచ్చాయని స్పష్టమవుతోంది.
ఈ హెచ్చరికలు అందిన సమయంలో అమెరికాలో కొన్ని కరోనా కేసులు సైతం నమోదయ్యాయి. అదే సమయంలో ట్రంప్ ఈ వైరస్ అంత ప్రమాదకరమేమీ కాదన్నట్లు వ్యవహరించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన 'అమెరికాలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
ఫలితంగా ఇప్పుడు కొవిడ్ కోరల్లో చిక్కుకున్న అతిపెద్ద దేశంగా అమెరికా నిలిచింది. కేసులు దాదాపు 7 లక్షలకు చేరువగా ఉన్నాయి. మరణాల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. న్యూయార్క్ నగరం మృత్యుదిబ్బలా మారింది.
అసలు చూడనేలేదా?
ఫిబ్రవరి 25న నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటెలిజెన్స్ జారీ చేసిన హెచ్చరికల్లో సంస్థ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అందించిన సమాచారం అధికారులుకు పంపించింది. అయితే ఈ సమాచారం అధ్యక్షుడు ట్రంప్ గానీ, శ్వేతసౌధ అధికారులు గానీ చూశారా? లేదా? అన్న ప్రశ్నకు బదులు లేకుండా పోయింది. మరోవైపు జనవరి నుంచే పలు నిఘా సంస్థలు కరోనా వైరస్ గురించి సంక్షిప్తంగా సమాచారం అందిస్తూనే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పగడ్బందీగా విశ్లేషణ
నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటెలిజెన్స్ సంస్థ తన సమాచారాన్ని రక్షణ, వైద్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. హెల్త్, హ్యూమన్ ఆరోగ్య కార్యదర్శికి సైతం సమాచారం చేరవేస్తుంది. మేరీలాండ్ రాష్ట్రంలోని ఫ్రెడెరిక్ ప్రాంతంలో ఈ సంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 100 మందికిపైగా వివిధ వైద్య నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారు.
సమాచారం ఎక్కడిది?
ఈ సంస్థలో వచ్చే సమాచారం ఎలా విశ్లేషిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదైనా విపత్కర పరిస్థితులకు సంబంధించిన సంకేతాలను ఎలా సేకరిస్తారన్న విషయాలు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు వివరించారు.
చాలావరకు సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్పైనే తాము అధ్యయనం చేస్తామని వారు చెబుతున్నారు. ఉదాహరణకు ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో వ్యాధి ప్రబలితే స్థానిక పత్రికల్లో సమాచారం వస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికప్పుడు ఇది ఆ ఖండంలోని మరో ప్రాంతంలో తెలిసే అవకాశం ఉండదు. ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ కన్నా ఎక్కువ సమాచారం
ఏదైనా ప్రాంతంలో వ్యాపిస్తున్న వ్యాధిపై సామాజిక మాధ్యమాల్లో డాక్డర్లు ఆందోళన వెలిబుచ్చడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేనన్ని సమాచార వనరులు వీరికి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాకు చెందిన 17 గూఢచార సంస్థలు సేకరించిన సమాచారం సైతం వీరికి అందుబాటులో ఉంటుంది.
జాతీయ భద్రత ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) సహా విదేశాల నుంచి సీఐఏ సేకరించిన నిఘా వర్గాల సమాచారాన్ని పరిశీలిస్తారు ఇక్కడి అధికారులు. నేషనల్ జియోస్పేషియల్-నిఘా సంస్థ ఇచ్చే శాటిలైట్ సమాచారంతో ఎబోలా, ఫ్లూ వంటి వ్యాధులు ప్రజల్లో ఏ విధంగా వ్యాపిస్తున్నాయన్న విషయంపై అధ్యయనం చేస్తారు.
"మేమంతా రోజూ ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రదేశంలో కాస్త భిన్నమైన సంఘటనలు జరుగుతున్న వాటిపై పరిశోధన చేసేవాళ్లం. వ్యాధులు, భూకంపాలు, జాతీయ విపత్తులు సహా దేశ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా దృష్టిసారిస్తాం."-మార్తా రైనీ, డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మాజీ ఉద్యోగి
ఈ తతంగం మొత్తాన్ని 'పెద్ద సూదుల కర్మాగారంలో మనకు కావాల్సిన ఒక సూది కోసం వెతుకుతున్నట్లు అనిపిస్తుంది' అని డెనీస్ కవుఫ్మన్ అభివర్ణించారు. ఈయన 1990 నుంచి 2005 మధ్య ఇక్కడ పనిచేశారు.