మెక్సికోలో జూన్ 6న ఎన్నికలు (mexico elections) జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మరో మేయర్ అభ్యర్థిని మెక్సికో గ్వానాజువాటో రాష్ట్రంలోని మోరోలియాన్ నగరంలో దుండగులు హతమార్చారు. దాంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా హత్యకు గురైన రాజకీయ అభ్యర్థుల సంఖ్య 34కు చేరింది. ఇది కచ్చితంగా నేర ముఠాల పనేనని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్వెల్ లోపెజ్ బుధవారం పేర్కొన్నారు.
మోరోలియాన్ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అల్మా బారాగాన్ అనే అభ్యర్థి మంగళవారం హత్యకు గురయ్యారు. అయితే.. తమకు అనుకూలమైన నేతలను ప్రభుత్వంలో ఉంచేందుకే డ్రగ్స్ ముఠాలు ఈ అరాచకాలకు పాల్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఓటింగ్లో పాల్గొనకుండా భయపెట్టేందుకు అభ్యర్థులను నేర ముఠాలు హత్య చేస్తున్నాయని లోపెజ్ అన్నారు.
బారాగాన్.. స్మాల్ సిటిజెన్స్ మూవ్మెంట్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన హత్య అనంతరం.. 'రాజకీయాల్లో పాల్గొనడం అంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమే'నని సదరు పార్టీ వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: కాలిఫోర్నియాలో కాల్పులు- 8 మంది మృతి