ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలకు సంబంధించి తాజా అధ్యయనం ఒకటి విస్తుపోయే విషయాలను బయట పెట్టింది. మృతుల సంఖ్యను లెక్కించడంలో పలుదేశాలు పారదర్శకంగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. భారత్‌లో ఈ నెల 3 నాటికి వాస్తవ కరోనా మరణాలతో పోలిస్తే.. 4.3 లక్షల మరణాలు తక్కువగా నమోదయ్యాయని అంచనా వేసింది. అమెరికా, రష్యా లెక్కల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నాయని పేర్కొంది.
'కొవిడ్‌తో మొత్తం మరణాల అంచనా' పేరుతో యూనివర్సిటీ ఆప్ వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్.. ఈ అధ్యయన నివేదికను వెలువరించింది. తాజా అధ్యయనం ప్రకారం.. కొవిడ్ మరణాల లెక్కింపులో బ్రిటన్ మెరుగ్గా వ్యవహరించిందని నివేదిక ప్రస్తావించింది. అమెరికాలో మరణాలు వాస్తవ లెక్కల కంటే 3.3 లక్షలు తక్కువగా నమోదయ్యాయని తెలిపింది. వ్యాధి నిర్ధరణ పరీక్షలు తగిన సంఖ్యలో జరగకపోవడం మృతుల లెక్కల్లో తేడాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంది.
కరోనా విజృంభణ సమయంలో వారం వారం నమోదైన మరణాలు, అంతకుముందు సీజన్లలో చోటుచేసుకున్న మరణాల సగటును పోల్చి చూడటం ద్వారా ఐహెచ్ఎం ఈ తాజా అధ్యయనాన్ని నిర్వహించింది.
దేశం | అధికారికంగా మరణాల సంఖ్య | వాస్తవ మరణాల అంచనా |
భారత్ | 2,21,181 | 6,54,395 |
అమెరికా | 5,74,043 | 9,05,289 |
మెక్సికో | 2,17,694 | 6,17,127 |
బ్రెజిల్ | 4,08,680 | 5,95,903 |
బ్రిటన్ | 1,50,519 | 2,09,661 |
రష్యా | 1,09,334 | 5,93,614 |